
అర్జీలన్నీ పరిష్కారం కావాలి
● కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్
పార్వతీపురం రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు సోమవారం వచ్చిన అర్జీలన్నీ పరిష్కారం కావాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులకు తేల్చిచెప్పారు. కలెక్టర్‌తో పాటు అర్జీల స్వీకరణలో సబ్‌కలెక్టర్ ఆర్.వైశాలి, డీఆర్‌ఓ కె.హేమలత, ప్రత్యేక ఉప కలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ ఎం.సుధారాణిలు వినతులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వినతులను సంబంధిత అధికారులకు అందించి పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన అర్జీలన్నీంటినీ పరిష్కారం చూపాలని, ఎక్కడా పెండింగ్ లేకుండా చేసి అర్జీదారులు సంతృప్తి చెందేలా చూడాలన్నారు. సోమవారం మొత్తం 65 వినతులు పలు సమస్యలపై అర్జీదారులు అందజేశారు.
ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌కు తగ్గిన వినతులు
సీతంపేట: స్థానిక ఐటీడీఏలోని ఎస్‌ఆర్‌శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు వినతులు తగ్గాయి. ప్రతి సోమవారం 20కు తగ్గకుండా వచ్చే వినతులు ఈ వారం పదిమాత్రమే వచ్చాయి. భారీగా వర్షాలు కురవడం, ఉభాల సీజన్ కావడంతో వినతులు తగ్గాయని అధికారులు తెలియజేస్తున్నారు. ఐటీడీఏ ఏపీఓ జి.చిన్నబాబు వినతులు స్వీకరించారు. టిటుకుపాయికి చెందిన నిమ్మక చిరంజీవితో పాటు పలువురు గ్రామస్తులు కొండచీపుళ్లు కొనుగోలు చేసి, విక్రయించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు.సదరం సర్టిఫికెట్ ఇప్పించాలని పాలిష్‌కోటకు చెందిన భవాని కోరగా లాడకు చెందిన సుక్కయ్య వృద్ధాప్య పింఛన్ ఇప్పించాలని అర్జీ అందజేశాడు. పాతరేగులగూడకు చెందిన సుక్కమ్మ పవర్ వీడర్ ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది. కార్యక్రమంలో పలువురు ఐటీడీఏ అధికారులు పాల్గొన్నారు.