
పాపం.. ఎవరో ఈమె..!
● వర్షంలో తడుస్తూ అమాయకంగా రోదిస్తూ
● కారు చీకటిలో మూడు రోజులుగా
బొప్పడాం జంక్షన్‌లోనే
● సపర్యలు చేస్తున్న స్థానికులు
నెల్లిమర్ల రూరల్: ఈ చిత్రంలో కనిపిస్తున్న వృద్ధురాలికి సుమారు 80 ఏళ్లు పైనే ఉంటాయి. మూడు రోజుల క్రితం నెల్లిమర్ల మండలంలోని బొప్పడాం జంక్షన్‌కు వచ్చి..అప్పటి నుంచి అక్కడే ఉన్న బస్టాప్‌లోనే ఒంటరిగా ఉంటోంది. వర్షానికి తడుస్తూ..అమాయకంగా రోదిస్తూ ఏమీ చెప్పలేని దీనావస్థలో ఉంది. స్థానిక విజయగౌరి యువజన సేవా సంఘం అధ్యక్షుడు పిల్లా సుధాకర్‌తో పాటు పలువురు స్థానికులు సదరు వృద్ధురాలిని అక్కున చేర్చుకుని మూడు రోజుల నుంచి భోజన సదుపాయం కల్పిస్తున్నారు. అయినప్పటికీ రాత్రి సమయంలో కారు చీకటిలో ఒంటరిగా బస్టాప్‌లోనే కాలాన్ని వెళ్లదీస్తోంది. స్థానికులు ఆరా తీయగా..తన పేరు శ్రీకాకుళం దుర్గమ్మ అని..భర్త పేరు సత్యం అని చెబుతోంది. పెద్ద కూతురు పేరు గంగమ్మ అని, కుమారుడి పేరు సన్యాసిరావు అని చెబుతోంది. ఊరు పేరు మాత్రం స్పష్టంగా చెప్పలేకపోతోంది. ఒక సారి జామి వద్ద బంధువులు ఉన్నారని..మరో సారి పొందూరు, రాజాం అంటూ చెబుతోందని స్థానికులు తెలిపారు. కుటుంబ సభ్యుల పేర్లు చెబుతున్నప్పటికీ ఊరి పేరు మాత్రం స్పష్టంగా చెప్పలేకపోతోందంటున్నారు. మూడు రోజుల క్రితం విజయనగరం నుంచి బస్సులో బొప్పడాం జంక్షన్‌లో దిగిందని చెబుతున్నారు. బంధువుల ఇంటికి వెళ్లి తప్పిపోయిందా..? లేక మతిస్థిమితం లేక ఇంటి నుంచి వచ్చేసిందా? అనే విషయం తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యుల ఆచూకీ తెలిస్తే ఫోన్ 8374273700 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సామాజిక కార్యకర్త సుధాకర్ కోరారు. పోలీసులకు కూడా సమాచారం ఇచ్చామని, ఎవరూ స్పందించకపోతే వృద్ధాశ్రమంలో చేర్పిస్తామని ఆయన తెలిపారు.