
నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ పాఠశాల
రాజాం: తుఫాన్ వర్షాలకు ప్రభుత్వ, పైవేట్ పాఠశాలలకు కలెక్టర్ సోమవారం సెలవు ప్రకటించారు. రాజాంలోని చీపురుపల్లి రోడ్డులో గల ప్రభాకర్ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం మొండిగా వ్యవహరించి, పాఠశాల తెరవడమే కాకుండా తరగతులకు గైర్హాజరైన విద్యార్థులపై చర్యలు ఉంటాయని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఈ విషయం బయటకు తెలియడంతో రాజాం ఎంఈఓ యాగాటి దుర్గారావు పాఠశాలకు సోమవారం చేరుకుని తనిఖీ నిర్వహించారు. ఆ సమయంలో పాఠశాలలో విద్యార్థులు ఉండడం చూసి మండిపడ్డారు. యాజమాన్యాన్ని మందలించడంతో పాటు నోటీసులు అందించారు. వెంటనే తరగతి గదుల్లోని విద్యార్థులను సురక్షితంగా వారి ఇళ్లకు పంపించాలని ఆదేశించడంతో పాటు దగ్గరుండి ఇళ్లకు తరలించారు. అనంతరం నివేదికలు తయారు చేసి జిల్లా అధికారులకు పంపించినట్లు తెలిపారు. మరో ప్రైవేట్ పాఠశాల తెరిచి ఉందని తెలిసి అక్కడికి వెళ్లి తనిఖీచేశామని ఎంఈఓ విలేకరులకు తెలిపారు. అప్పటికే అక్కడి విద్యార్థులు వెళ్లిపోయారన్నారు.

నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ పాఠశాల