దివ్యాంగులపై కూటమి కుట్ర..! | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగులపై కూటమి కుట్ర..!

Aug 19 2025 6:41 AM | Updated on Aug 19 2025 6:41 AM

దివ్య

దివ్యాంగులపై కూటమి కుట్ర..!

● ఇది అన్యాయం

చిత్రంలో కనిపిపస్తున్న దివ్యాంగురాలి పేరు జాగరపు సత్యవతి. ఈమెది ఎస్‌.కోట మండలం ఆలుగుబిల్లి( కొత్తకోట). ఆమెకు గత ఆరేళ్లుగా దివ్యాంగుల పింఛన్‌ అందుతోంది. రెండు రోజుల కిందట దివ్యాంగ్‌ పింఛన్‌ నిలిపివేస్తున్నట్టు సచివాలయం వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ నోటీసు ఇచ్చారు. గతంలో ఆమెకు జిల్లా ఆస్పత్రి (ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి) వైద్యులు 66 శాతం శాశ్వత వైకల్యం ఉన్నట్టు సదరం సర్టిఫికెట్‌ ఇచ్చారు. ఇప్పడు నోటీస్‌లో పింఛన్‌ పొందడానికి రీ అసెస్‌మెంట్‌లో అనర్హులుగా వైద్యులు గుర్తించినందున తొలిగిస్తున్నట్టు నోటీస్‌లో పేర్కొనడం గమనార్హం.

ఫొటోలో కనిపిస్తున్న దివ్యాంగుడి పేరు వేమలి పెంటయ్య. ఈయనది గంట్యాడ మండలం పెదవేమలి గ్రామం. ఇతనికి గత 15 ఏళ్లుగా పింఛన్‌ వస్తోంది. శాశ్వత వైకల్యం ఉన్నట్టు జిల్లా ఆస్పత్రి (ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి) వైద్యులు సదరం సర్టిఫికెట్‌ కూడా ఇచ్చారు. సోమవారం ఇతనికి పింఛన్‌ నిలిపివేస్తున్నట్టు సచివాలయం ఉద్యోగి నోటీసు అందజేశారు.

విజయనగరం ఫోర్ట్‌:

కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తోంది. వివిధ పథకాల్లో కోత పెట్టడమే పనిగా పెట్టుకుంది. సర్వేల పేరుతో అర్హులను అనర్హులుగా ముద్రవేస్తోంది. తాజాగా దివ్యాంగుల పింఛన్లకు ఎసరు పెట్టింది. దివ్యాంగ పింఛన్ల పరిశీలన పేరిట అర్హులకు అన్యాయం చేస్తోంది. ఏళ్లుగా పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులకు కొత్త నిబంధనలతో కొర్రీ పెడుతోంది. గత సదరం ధ్రువపత్రాలను రద్దు చేసి, దివ్యాంగత్వ శాతం తక్కువ ఉందన్న నెపంతో వేలాది మందిని లబ్ధికి దూరం చేస్తోంది. దివ్యాంగులు, ఆరోగ్యపరమైన సమస్యలున్న వారి కోటాలో రూ.6 వేలు, రూ.15 వేలు చొప్పున పింఛన్లు అందిస్తున్న విషయం విదితమే. గత ప్రభుత్వ హయాంలో అనర్హులు లబ్ధి పొందారన్న ఆరోపణలతో గత జనవరి నుంచి సర్వే చేపడుతోంది. ఈ క్రమంలో చాలా మంది అర్హులకు అనర్హత నోటీసులు అందిస్తుండడంతో వారిలో ఆందోళన మొదలైంది. వారంతా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్‌లో పింఛన్‌ బాధితులు అధికమంది కలెక్టర్‌కు వినతులు అందజేశారు.

ఇదెక్కడి అన్యాయం బాబూ..

పుట్టుకతో దివ్యాంగత్వం ఉన్నా...

పుట్టకతో పోలియో బారిన పడిన వారు, పక్షవాతంతో ఏళ్ల తరబడి బాధపడుతున్నవారు, అంధులు, కాలు, చేయి వైకల్యం ఉన్నవారు, మానసిక దివ్యాంగులు, చెవిటి మూగవారు.. ఇలా అనేక మంది పింఛన్లు తొలగిస్తూ నోటీసులు ఇవ్వడంపై జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పల్లెల్లోని రచ్చబండలపై కూటమి తీరును ఎండగడుతూ, విమర్శనాత్మక చర్చలు జోరందుకున్నాయి.

పరిశీలన పేరిట పింఛన్ల తొలగింపు

జిల్లాలో వేలాది మందికి ఫించన్లు

నిలిపివేస్తూ నోటీసులు జారీ

ఆవేదన చెందుతున్న దివ్యాంగులు

జిల్లాలో ఐదువేల మందికి పైబడి

నోటీసులు

పుట్టకతో పోలియో ఉన్నవారికి సైతం నిలిపివేసిన వైనం

ప్రభుత్వ తీరుపై భగ్గుమంటున్న

దివ్యాంగులు, ప్రజాసంఘాలు

రేగిడి: దివ్యాంగుల పింఛన్లు రద్దుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అన్యాయమని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌, వైఎస్సార్‌సీపీ రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ తలే రాజేష్‌లు అన్నారు. రేగిడిలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత దివ్యాంగులకు రూ.6వేలు పింఛన్‌ అందజేస్తున్నామని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇప్పుడు పింఛన్లు రద్దుచేస్తూ నోటీసులు అందజేస్తుండడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఇంతవరకు కొత్తగా ఒక్క దివ్యాంగునికి కూడా పింఛన్‌ మంజూరుచేయకుండా, ఇప్పుడు ఉన్నవి రద్దుచేసేందుకు నిర్ణయం తీసుకోవడం శోచనీయమన్నారు. దివ్యాంగుల్లో బోగస్‌ పింఛన్‌ పొందుతున్నవారు ఉన్నారని చంద్రబాబు చెబుతుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పుడు పింఛన్‌ రద్దు అయిన వారిలో గతంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే పింఛన్‌ మంజూరైన వారు ఉన్న విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆధార్‌ కార్డులు మార్పుచేసుకుని తెలుగుదేశం నాయకులు, జన్మభూమి కమిటీ సభ్యులు లబ్ధిదారులైన విషయం కూటమి నాయకులు గుర్తెరగాలని వివరించారు. మరోసారి విశాఖపట్నం కేజీహెచ్‌ వైద్యాధికారులతో పింఛన్‌ రద్దయిన దివ్యాంగుల దివ్యాంగత్వాన్ని పరిశీలించాలని డిమాండ్‌ చేశారు. దివ్యాంగుల తరఫున పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయుడు, పార్టీ మండల కన్వీనర్‌ వావిలపల్లి జగన్మోహనరావు, వైఎస్సార్‌ సీపీ రాజాం నియోజకవర్గ బీసీ సెల్‌ అధ్యక్షుడు కరణం శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌

సెప్టెంబర్‌ నుంచి పింఛన్‌ నిలిపివేస్తాం

రీ వెరిఫికేషన్‌లో వైద్యులు 40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్నట్టు నిర్ధారించిన వారికి సెప్టెంబర్‌ నెల నుంచి పింఛన్‌ నిలిపివేస్తాం. ఇందులో 60 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్‌ కింద మార్పుచేసి పింఛన్‌ ఇవ్వడం జరుగుతుంది. నోటీస్‌ అందుకున్న దివ్యాంగులు అప్పీల్‌కు వెళ్లవచ్చు. సర్వజన ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రిలో మాన్యువల్‌ మెడికల్‌ సర్టిఫికెట్‌ను తీసుకుని ఎంపీడీఓకు అందజేయాలి. నోటీస్‌ అందుకున్న 30 రోజుల్లోగా సర్టిఫికెట్‌ అందజేయాలి.

– శ్రీనివాస్‌, డీఆర్‌డీఏ పీడీ

పింఛన్ల తొలగింపుపై దివ్యాంగులు ఆవేదన చెందుతున్నారు. రూ.200 నుంచి పింఛన్‌ అందుకుంటున్నామని, ఇప్పుడు రూ.6000 ఇచ్చినట్టే ఇచ్చి తొలగించడంపై గగ్గోలు పెడుతున్నారు. జీవనాధారాన్ని దూరం చేయొద్దంటూ వేడుకుంటున్నారు. జిల్లాలో ఐదు వేలకు పైగా దివ్యాంగులకు పింఛన్లు తొలిగిస్తున్నట్టు సచివాలయ సిబ్బంది నోటీసులు అందజేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏళ్ల తరబడి వచ్చే పింఛన్‌ తొలిగిస్తున్నట్టు నోటీస్‌ ఇవ్వడం పట్ల లబ్ధిదారులతో పాటు వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.

దివ్యాంగులపై కూటమి కుట్ర..! 1
1/4

దివ్యాంగులపై కూటమి కుట్ర..!

దివ్యాంగులపై కూటమి కుట్ర..! 2
2/4

దివ్యాంగులపై కూటమి కుట్ర..!

దివ్యాంగులపై కూటమి కుట్ర..! 3
3/4

దివ్యాంగులపై కూటమి కుట్ర..!

దివ్యాంగులపై కూటమి కుట్ర..! 4
4/4

దివ్యాంగులపై కూటమి కుట్ర..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement