
వరద తాకిడి
సంతకవిటి/డెంకాడ/వంగర: జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు ఉప్పొంగాయి. పంటల పొలాలను వరదనీరు ముంచెత్తింది. కొన్నిచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
● తుఫాన్ ప్రభావంతో సంతకవిటిలో సోమవారం 31.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గోళ్లవలస, ఎమ్.ఆర్.అగ్రహారం, సంతకవిటి గ్రామాల్లో వరి పొలాలు నీట మునిగాయి. తహసీల్దార్ బి.సుదర్శనరావు నదీ తీర గ్రామాలైన జావాం, కె.ఆర్.పురం, రంగారాయపురం, పి.జె పేట, తమరాం, మేడమిర్తి, బూరాడపేట, హొంజరాం, పోడలి, చిత్తారపురం తదితర గ్రామాల్లో పర్యటించి ప్రజలను నదులవైపు వెళ్లొద్దని హెచ్చరికలు జారీచేశారు.
● భారీ వర్షాలకు డెంకాడ మండలం గొడిపాలెం పాలగెడ్డ రిజర్వాయర్ పొంగి ప్రవహిస్తోంది.
● వంగర మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టుకు వరదతాకిడి కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 8వేల క్యూసెక్కుల నీరు చేరుతుండగా 10వేల క్యూసెక్కుల నీటిని నాగావళి నదిలోకి విడిచిపెడుతున్నట్టు డీఈ పి.అర్జున్ తెలిపారు.
● నాగావళి నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో వంగర మండల పరిధి వి.వి.ఆర్.పేట, రాజులగుమ్మడ, రుషింగి, తలగాం, శివ్వాం తదితర తీర గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
జిల్లాలో నేడు, రేపు భారీ వర్షాలు
విజయనగరం అర్బన్: జిల్లాలో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. జిల్లాలో వర్షాల పరిస్థితిపై సోమవారం సమీక్షించారు. పారిశుద్ధ్య పనులపై ఎంపీడీఓలు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఎస్.కోట, ఎల్.కోట, వేపాడ మండలాల్లో 100 మిల్లీ మీటర్లపైగా వర్హపాతం నమోదైందన్నారు. నాగావళి పరివాహక ప్రాంతమైన సంతకవిటి, రాజాం, ఆర్.ఆముదాలవలస, వంగర మండలాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. మడ్డువలస రిజర్వాయర్ ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో నిలకడగా ఉందని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. నీటి పారుదల శాఖ, రోడ్డు భవనాలు, మున్సిపాలిటీ, వైద్యారోగ్య శాఖ, ఐసీడీఎస్ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి వారి శాఖలకు సంబంధించిన పనులు పూర్తిచేయాలన్నారు. వసతిగృహాల విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.

వరద తాకిడి

వరద తాకిడి

వరద తాకిడి

వరద తాకిడి

వరద తాకిడి