
కూటమి అడ్డగోలు జీఓపై ఆందోళన
విజయనగరం: ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోకి విద్యార్థి సంఘాల నాయకులకు అనుమతి నిరాకరించేలా కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన అడ్డగోలు జీఓను వెంటనే ఉపసంహరించుకోవాలని వైఎస్సార్ సీపీ విద్యా విభాగం నాయకులు డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ విద్యా విభాగం జిల్లా శాఖ ఆధ్వర్యంలో విజయనగరంలో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. విద్యావిభాగం జిల్లా అధ్యక్షుడు కరుమజ్జి సాయికుమార్, యువజన నాయకులు జి.ఈశ్వర్‌కౌశిక్, చాణుక్య మాట్లాడుతూ నారాలోకేశ్ విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించేందుకు తన రెడ్‌బుక్ పరిపాలనలో భాగంగా నూతన జీఓను తీసుకు వచ్చారని విమర్శించారు. గత ప్రభుత్వం విద్యావ్యవస్థను బలోపేతం చేస్తే నేటి కూటమి ప్రభుత్వం పేదలకు ప్రభుత్వ విద్య అందకుండా చేస్తోందని ఆరోపించారు. అనంతరం బాలాజీ కూడలిలో అంబేడ్కర్ విగ్రహం వద్ద కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కూటమి దుర్మార్గ పాలనపై అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ విద్యా యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు.