
గంటేడ పాటల పుస్తక పరిచయం
పార్వతీపురం: ప్రముఖ కవి గంటేడ గౌరునాయుడు రాసిన ‘పాడుదమా స్వేచ్ఛా గీతం’ పుస్తక పరిచయ కార్యక్రమాన్ని ఆదివారం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌరునాయుడు రాసిన పాటల పుస్తకాన్ని పరిచయం చేస్తూ నేటివరకు ఆయన రాసిన పాటలను గుర్తుచేస్తూ వక్తలు ఉపన్యాసాలు ఇచ్చారు. ముందుగా పాయల మురళీకృష్ణ పుస్తక పరిచయం చేయగా పలువురు గంటేడ రాసిన పాటలను ఆలపించారు. కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ప్రజల జీవన శైలిని ప్రజలకు ఉన్న ఆకాంక్షలను తన రచనల ద్వారా ప్రపంచానికి తెలియజేసిన గొప్ప సాహితీవేత్త గంటేడ గౌరునాయుడు అని, ‘స్నేహకళా సాహితి’ పేరుతో సంస్థను స్థాపించి కళింగాంధ్ర ప్రాంతంలో ఎందరో యువ కవులను, రచయితలను ప్రోత్సహిస్తున్నారని వక్తలు ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంవీఆర్ కృష్ణాజీ హాజరు కాగా చీకటి దివాకర్ అధ్యక్షత వహించారు. దేశ గత చరిత్ర నెత్తిటి మరక పాటల సీడీని డాక్టర్ వెంకట్రావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఇంటర్ విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు, డాక్టర్ మంచిపల్లి శ్రీరాములు, గజల్ వినోద్, ఉపాధ్యాయులు, సాహితీవేత్తలు, మేధావులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.