
జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాల, సర్వజన ఆసుపత్రుల్లో ప
విజయనగరం ఫోర్ట్:
‘తమ్ముళ్లూ.. మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి.. లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.. అది కూడా పూర్తి పారదర్శకంగా నియామకాలు చేపడతాం...’ ఇదీ సార్వత్రిక ఎన్నికల వేళ కూటమి నేతలు చెప్పిన మాటలు. గద్దెనెక్కిన తరువాత కూటమి పాలకులు అప్పుడు చెప్పిన మాటలను ఇప్పుడు పెడచెవిన పెట్టేశారు. పారదర్శకతకు పాతర వేసేలా కూటమి నేతలు వ్యవహరిస్తున్నారన్న తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి సర్కారు నోటిఫికేషన్ ఇచ్చిందే తప్ప ఖాళీలను భర్తీ చేసేందుకు శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నోటిఫికేషన్ ఇచ్చి నెలలు తరబడి జాప్యం చేస్తుండడంతో దరఖాస్తు చేసిన అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే...
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 2023 నవంబర్ నెలలో ప్రభుత్వ వైద్య కళాశాల, సర్వజన ఆసుపత్రుల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ తర్వాత ఎన్నికల కోడ్ రావడంతో పోస్టులు భర్తీ నిలిచింది. తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ పోస్టులు భర్తీ చేయకుండా 2024 నవంబర్ నెల వరకు జాప్యం చేసింది. దీంతో ఏడాది అయిపోయిందని చెప్పి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. ఆ పోస్టులు భర్తీ చేస్తే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో కూటమి సర్కార్ జాప్యం చేసి రద్దు చేసిందనే ఆరోపణలు వచ్చాయి.
● 2024 డిసెంబర్‌లో మళ్లీ నోటిఫికేషన్
ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో పోస్టుల భర్తీకి కూటమి సర్కార్ డిసెంబర్ 28, 2024న మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేసింది. పారా మెడికల్ పోస్టులకు సంబంధించి 20 కేటగిరీల్లో 91 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ పోస్టులకు అర్హత గల 6 వేల మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు.
● జాప్యానికి కారణమేంటో...
కూటమి నేతలు చెప్పిన వారికి పోస్టులు కట్టబెట్టేందుకు జాప్యం చేస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అందువల్లే నెలల తరబడి పోస్టులు భర్తీ చేయకుండా జాప్యం చేస్తున్నారనే విమర్శలున్నాయి. నోటిఫికేషన్ ఇచ్చిన నెల రోజుల్లోగా పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా ఎనిమిది నెలలైనా భర్తీ చేయకపోవడం పట్ల అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పోస్టులు భర్తీ అత్యంత పారదర్శకంగా నిర్వహించేవారు. ఇప్పడు అందుకు విరుద్ధమైన పరిస్థితి ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎనిమిది నెలల కిందట నోటిఫికేషన్
నేటికీ పోస్టులు భర్తీ చేయని వైనం
20 కేటగిరీల్లో 91 పోస్టులకు ప్రకటన
కూటమి నేతల అనుచరులకే పోస్టులు కట్టబెట్టేందుకు ఈ జాప్యమన్న
ఆరోపణలు
గతంలో ఇదే తరహాలో ఏడాది జాప్యం చేసి నోటిఫికేషన్ రద్దు
ఫైల్ కలెక్టర్‌కు పంపించాం..
ప్రభుత్వ వైద్య కళాశాల, సర్వజన ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైల్ కలెక్టర్‌కు పంపించాం. అక్కడ నుంచి అనుమతులు రాగానే భర్తీ ప్రక్రియ చేపడతాం.
– డాక్టర్ దేవి మాధవి, ప్రిన్సిపాల్,
ప్రభుత్వ వైద్య కళాశాల
ఎనిమిది నెలలైనా..
పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి ఎనిమిది నెలలు అయినా కూటమి సర్కార్ పోస్టులు భర్తీ చేయకుండా జాప్యం చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నోటిఫికేషన్ కాలపరిమితి ముగియడానికి ఇంకా నాలుగు నెలలే గడువు ఉండడంతో గతంలో మాదిరి నోటిఫికేషన్ రద్దు చేస్తారేమోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాల, సర్వజన ఆసుపత్రుల్లో ప

జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాల, సర్వజన ఆసుపత్రుల్లో ప