
వేటకు అల్పపీడనం దెబ్బ..!
ప్రతికూల వాతావరణంతో పతివాడబర్రిపేటలో ఉధృతంగా సముద్ర కెరటాలు
పూసపాటిరేగ:
సముద్రమే సర్వస్వంగా జీవిస్తున్న గంగపుత్రులకు అల్పపీడన ప్రభావంతో ఏర్పడిన ప్రతికూల వాతావరణం వల్ల వేట సాగక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. అల్పపీడనం వల్ల వాతావరణ మార్పులతో సముద్ర అలలు కల్లోలంగా మారడంతో వేట సాగడం లేదు. తాజాగా గడిచిన మూడు రోజులుగా కెరటాలు ఉధృతి పెరగడంతో చేపల వేటకు వెళ్లలేకపోతున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో 27 కిలోమీటర్ల తీర ప్రాంతం వుంది. 21 మత్స్యకార గ్రామాలు వున్నాయి. ఆయా గ్రామాలలో సుమారు 21 వేల మంది మత్స్యకారులు జీవిస్తున్నారు. వేటపై ప్రత్యక్షంగా ఆరు వేల మంది, పరోక్షంగా 15 వేల మంది ఆధారపడి జీవిస్తున్నారు. సాంప్రదాయ బోట్లు, ఇంజన్ బోట్లు రెండు మండలాల్లో 1120 వరకు వున్నాయి. వాటిలో 885 బోట్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజిష్టర్ అయి వున్నాయి. ఈ ఏడాది వేట నిషేధం తరువాత వేట ప్రారంభించినప్పటి నుంచి ఆశించిన స్థాయిలో చేపలు వలకు చిక్కడం లేదని మత్స్యకారులు వాపోతున్నారు. నిషేధ సమయంలో కుటుంబాలు ఎలాగో నెట్టుకొచ్చినా.. మళ్లీ అల్పపీడనం రూపంలో కష్టాలు ప్రారంభమయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులుగా బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా అలలు ఉధృతి ఎక్కువై బోట్లు తీరానికే పరిమితమయ్యాయని వాపోతున్నారు. వేట సాగకపోవడంతో వలలకు మరమ్మతులు చేసుకుంటున్నామని చెబుతున్నారు. ఏడాదిలో సగం రోజులు ప్రకృతి వైపరీత్యాలు, మరి కొన్ని రోజులు తుఫాన్ హెచ్చరికలు, ప్రతికూల వాతావరణంతో వేట సాగక ఇబ్బందులు పడుతున్నామని వారు పేర్కొంటున్నారు. మత్స్యకార జీవన విధానంలో మార్పులకు సర్కారు ప్రత్యామ్నాయం ఆలోచించి వేట లేని సమయంలో ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు.
పతివాడబర్రిపేటలో తీరానికే పరిమితమైన బోట్లు
ప్రతికూల వాతావరణంతో ఇబ్బందులు
సముద్రంలో అల్పపీడనం ప్రభావంతో ప్రతికూల వాతావరణం నెలకొంది. సముద్రంలో అలల ఉధృతి పెరిగింది. వాతావరణంలో మార్పులు కారణంగా వేట చేయలేని పరిస్థితి నెలకొంది. వేట సాగకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. తమకు వేట లేని సమయంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఆలోచించి ఆదుకోవాలి.
– బర్రి అమ్మోరు, పతివాడబర్రిపేట
ప్రతికూల వాతావరణంతో కొనసాగని చేపల వేట
మూడు రోజులుగా తీరంలో కురుస్తున్న భారీ వర్షాలు
గంగపుత్రులకు ఆర్థిక కష్టాలు

వేటకు అల్పపీడనం దెబ్బ..!