
నేడు పాఠశాలలకు సెలవు
విజయనగరం అర్బన్: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా సోమవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు ఒక రోజు సెలపు ప్రకటించినట్టు కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం వర్షాల కారణంగా విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ నిర్ణయాన్ని గమనించాలని ఆయన సూచించారు. వర్షాల కారణంగా ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిగా నసీర్
విజయనగరం: పార్టీ సంస్థాగత నియామకాల్లో భాగంగా వైఎస్సార్ సీపీ నూతన నియామకాలు చేపట్టింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహనరెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన నియామకాలకు సంబంధించి ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ రాష్ట్ర మైనార్టీ విభాగం అధికార ప్రతినిధిగా విజయనగరం నియోజకవర్గానికి చెందిన మహమ్మద్ నసీర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మడ్డువలస నుంచి 10వేల క్యూసెక్కుల నీరు విడుదల
వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. ఆదివారం ఉదయం సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి 7వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు వద్ద 64.30 మీటర్లు లెవెల్ నీటిమట్టాన్ని అధికారులు స్థిరీకరించారు. ఒక గేటు ఎత్తి 10వేల క్యూసెక్కుల నీటిని నాగావళి నదిలోకి విడిచిపెడుతున్నామని ఏఈ నితిన్ తెలిపారు.
కూటమి పాలనలో మహిళా ఉద్యోగులకు వేధింపులు
నెల్లిమర్ల రూరల్: కూటమి ప్రభుత్వంలో మహిళా ఉద్యోగులకు వేధింపులు ఎక్కువయ్యాయని జై భీమ్‌రావ్ భారత్ పార్టీ జిల్లా అధ్యక్షుడు టొంపల నరసయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కనిగిరి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. మండలంలోని గుషిణి గ్రామంలో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీల నాయకులు, అనుచరుల వేధింపులు రాష్ట్రంలో ఏదో ఒక చోట నిత్యకృత్యమయ్యాయని ఆరోపించారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో గర్భిణి శ్రావణి ఆత్మహత్యే అందుకు ఉదాహరణ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ రాత్రి 10 గంటల తరువాత మహిళ ఉద్యోగులను పార్టీ కార్యాలయానికి రప్పించడమేమిటని ప్రశ్నించారు. రాత్రి 10.30 దాటిన తరువాత వీడియో కాల్స్ చేసి వేధించడం దుర్మార్గమైన చర్య అన్నారు. పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్యపై కక్ష సాధింపు చర్యలకు దిగి అన్యాయంగా బదిలీ చేయించారన్నారు. ఎమ్మెల్యేకు అనుకూలంగా ఉన్న సొంత సామాజిక వర్గానికి చెందిన ఎస్‌ఎస్‌ఏ అధికారి శశిభూషణ్ నుంచి తప్పుడు నివేదికలు తెప్పించి దళిత ఉద్యోగి సౌమ్యకు అన్యాయం చేశారని ఆరోపించారు. శశిభూషణ్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ పార్లమెంట్ ఇన్‌చార్జ్ చిన్నం అరుణ్‌కుమార్ పాల్గొన్నారు.
నేడు పీజీఆర్‌ఎస్
సీతంపేట: స్థానిక ఐటీడీఏలో సోమవారం పీజీఆర్‌ఎస్ నిర్వహించనున్నారు. ఏపీవో చిన్నబాబు వినతులు స్వీకరించనున్నారు. గిరిజనులు తమ సమస్యలపై వినతులు సమర్పించవచ్చని ఐటీడీఏ అధికార వర్గాలు తెలిపాయి.

నేడు పాఠశాలలకు సెలవు