
అదానీ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్
బొబ్బిలి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అదానీ రాష్ట్రంగా కూటమి ప్రభుత్వం మర్చేస్తుందని ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి బి.ధనలక్ష్మి విమర్శించారు. స్థానిక ఓ ప్రైవేటు రెసిడెన్సీలో ఆదివారం ఆశ వర్కర్స్ యూనియన్ 4వ జిల్లా మహాసభలు నిర్వహించారు. ముందుగా సీఐటీయూ జెండాను యూనియన్ నాయకురాలు లంక శాంతి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన మహాసభలో ధనలక్ష్మి మాట్లాడుతూ పారిశ్రామికవేత్త అదానీకి దేశాన్ని అప్పగించేందుకు మోదీ, అమిత్‌షాలు ప్రయత్నిస్తుంటే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోందని ఆరోపించారు. ఆశ వర్కర్లకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని, మెటర్నటీ సెలవులను ఆరు నెలలు ఇవ్వాలని, ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని, వయోపరిమితి పెంచాలన్న ఆందోళన చేపడితే కొన్ని డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించిందని, ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆశ వర్కర్ల సమస్యలపై ఐక్యంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పి.శంకర్రావు, ఎస్.గోపాలం, యూటీఎఫ్ నాయకురాలు కె.విజయగౌరి తదితరులు పాల్గొని మాట్లాడారు.
ఆశ వర్కర్స్ యూనియర్
రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి