
కన్యాశుల్కం ప్రదర్శన పూర్వజన్మ సుకృతం
విజయనగరం టౌన్: మహాకవి గురజాడ కలం నుంచి జాలువారిన కన్యాశుల్కం నాటకాన్ని 60 ఏళ్లకు పైబడిన మహిళలతో రవీంద్రభారతిలో ప్రదర్శించడం పూర్వజన్మ సుకృతమని దర్శకులు ఈపు విజయకుమార్ పేర్కొన్నారు. మహాకవి స్వగృహంలో శనివారం సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయసూర్య ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కన్యాశుల్కంలోని బొంకులదిబ్బ సీన్, మధురవాణి ఇల్లు–మంచం సీన్, అగ్నిహోత్రవధాన్లు ఇళ్లు – తాంబూలాల సీన్, సౌజన్యరావు పంతుల ఇళ్లు (డామిట్ కథ అడ్డం తిరిగింది సీన్)ను కేవలం వయోవృద్ధులైన మహిళలతో విజయవంతంగా నిర్వహించడం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. ఈ నెల 12న రవీంద్రభారతిలో అభినయ నేషనల్ థియేటర్ ఫెస్టివల్–2025లో కన్యాశుల్కం ప్రదర్శించి ఆహుతుల మన్ననలు పొందామన్నారు. గాంధీ జ్ఞానప్రతిష్టాన్ చైర్మన్ డాక్టర్ గున్నా రాజేంద్రరెడ్డి, రిటైర్డ్ తహసీల్దార్ బి.సత్యానందం, సినీన టి, సంఘసేవకురాల కరాటే కల్యాణి, అభినయ శ్రీనివాస్ తదితరుల చేతుల మీదుగా ప్రశంసపత్రాలు, జ్ఞాపికలు అందుకున్నామన్నారు. భోగరాజు సూర్యలక్ష్మి నిర్వహణ బాధ్యతలతో పాటూ గిరీశం పాత్రధారిలో అద్భుతమైన ప్రదర్శన కనబర్చి ఆహుతుల మన్ననలు పొందారన్నారు. వీరితో పాటూ మధురవాణిగా ఎ.సీతామహాలక్ష్మి, కరటకశాస్త్రిగా ముళ్లపూడి సుభద్రాదేవీ, అగ్నిహోత్రవధానులుగా కుమారి సామవేదుల గీతారాణి, వెంకటమ్మగా ఉదయగిరి నీలిమ, రామప్పపంతులుగా సిహెచ్.రాజకుమారి, బుచ్చమ్మగా పూటకూళ్లమ్మ, పోటోగ్రఫీ పంతులు నౌకరుగా సామవేదుల సత్యలత, సౌజన్యరావు పంతులుగా చీకటి చంద్రికారాణిలు పాత్రోచితమైన ప్రదర్శన చేసి ఆహుతుల కరతాళ ధ్వనులందుకున్నారని తెలిపారు. శ్రీకాకుళానికి చెందిన ఎస్.రమణ రంగాలంకరణ, రూపాలంకరణ చేశారన్నారు. ఈ సందర్భంగా కన్యాశుల్కం నాటక ప్రదర్శనకు తోడ్పాటునందించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో భోగరాజు సూర్యలక్ష్మి, సుభద్రాదేవీ, కన్యాశుల్కం టీమ్ సభ్యులు పాల్గొన్నారు.