
బొబ్బిలిని మన్యం జిల్లాలో కలపాలి
బొబ్బిలి: ప్రభుత్వం నియోజకవర్గాలను పునర్విభజనకు సన్నాహాలు చేస్తున్న క్రమంలో బొబ్బిలి నియోజకవర్గాన్ని పార్వతీపురం మన్యం జిల్లాలో విలీనం చేయాలని ఐక్యవేదిక నాయకులు కోరారు. బొబ్బిలిలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలువరు మాట్లాడుతూ మన్యం జిల్లాకు బొబ్బిలి చేరువగా ఉందన్నారు. ఆ జిల్లాలో కలపడం వల్ల ఆర్థికంగా, భౌగోళికంగా ప్రయోజనాలు చేకూరుతాయని అభిప్రాయపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధికి అధిక నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు. సమావేశంలో వివిధ పార్టీల నాయకులు మరిశర్ల రామారావు నాయుడు, మువ్వల శ్రీనివాసరావు, ఒమ్మి రమణ, కోట అప్పన్న, రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు వేమిరెడ్డి లక్ష్మునాయుడు తదితరులు పాల్గొన్నారు.