ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు ఆదిలక్ష్మి. ఈమెది బొండపల్లి గ్రామం. ఊపిరితిత్తుల్లో కఫం చేరడంతో సర్వజన ఆస్పత్రిలో చేరింది. వైద్య పరీక్షల కోసం ఆమె ల్యాబొరేటరీ దగ్గరకు వెళ్లింది. వైద్య సిబ్బంది వీల్‌చైర్ ఇవ్వక పోవడంతో ఆమె బంధువే ఆమెను యూరిన్ బ్యాగ్‌తో పాటు వార్డుకు తీసుకెళ్లింది.
ఒకే బెడ్‌పై ఇద్దరు రోగులు చికిత్స పొందుతున్నది సర్వజన ఆస్పత్రిలోనే. బెడ్స్ ఖాళీ లేక పోవడంతో జనరల్ మెడిసిన్ వార్డులో ఇద్దరికి ఒకే బెడ్‌పై ఉంచి వైద్య సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. విరేచనాలతో బాధపడుతూ విజయనగరం పట్టణంలోని బలిజివీధికి చెందిన ఎం.శ్రీను, పాముకాటు వేయడంతో బొండపల్లి మండలం గొట్లాంకు చెందిన రెడ్డి అప్పలనాయుడు ఆస్పత్రిలో చేరారు. వీరిద్దరికీ ఒకే బెడ్‌పై చికిత్స అందిస్తున్నారు.
ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు ఎ.చిన్నారావు. ఇతనిది అల్లూరి సీతారామారాజు జిల్లా (పాడేరు) అనంతగిరి మండలంలోని కోటపత్తివలస గ్రామం. ఈ నెల 12న శరీరం అంతా నొప్పులు, కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడే స్థితిలో ఆస్పత్రిలో చేరాడు. 13వ తేదీ ఉదయం 11 గంటల వరకు ఎవరూ పట్టించుకోలేదని, నొప్పి భరించలేక పోతున్నానంటూ ఆవేదన వ్యక్తంచేశాడు.
● సర్వజన ఆస్పత్రిలో బెడ్స్‌ఫుల్..
వసతులు నిల్..!
● ఒకే బెడ్‌పై ఇద్దరు రోగులకు చికిత్స
● చికిత్స అందించడంలో వైద్యుల
అలసత్వం!
● ఆస్పత్రిలో రోజుకు 1200 వరకు ఓపీ నమోదు
● ఆస్పత్రిలో బెడ్స్ సంఖ్య 368
● రూ. 500 కోట్లతో గాజులరేగ వద్ద బోధనాస్పత్రి నిర్మాణం
● ప్రభుత్వ వైద్య కళాశాల ప్రాంగణంలో 1500 పడకలతో విశాలమైన భవనం నిర్మాణం
● ఆస్పత్రిని అక్కడికి తరలించక
పోవడంతో రోగులకు తప్పని ఇబ్బందులు
విజయనగరం ఫోర్ట్:
విజయనగరం జిల్లాలో అతిపెద్దది ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి. జిల్లా ప్రజలకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ఈ ఆస్పత్రినే ఆశ్రయిస్తారు. రోజుకు 1200 వరకు ఓపీ నమోదవుతుంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఆస్పత్రిలో సేవలు మృగ్యంగా మారాయి. వసతులు లోపించాయి. రోగులకు సకాలంలో సేవలు అందడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జనరల్ వార్డుల్లో ఆస్పత్రిలో చేరిన 24 గంటల వరకు వైద్యులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రోగులను వార్డులకు, ల్యాబ్‌కు, సిటీస్కాన్, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ స్కాన్, ఎంఆర్‌ఐ స్కాన్, ఆపరేషన్ థియేటర్స్, ఐసీయూ, డ్రెస్సింగ్ రూమ్‌లకు వెళ్లేందుకు వీల్ చైర్, స్టెచ్చర్ సదుపాయం కల్పించడంలేదని రోగులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజారోగ్యానికి భరోసా లేకుండా పోయిందని, గతంలో అందే స్థాయిలో సేవలు అందడం లేదని, పర్యవేక్షణ లోపించిందని వాపోతున్నారు.
విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో వరండాలోనే చికిత్స పొందుతున్న రోగులు
కూటమి నేతల తీరుతో తప్పని ఇబ్బందులు
ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించేదుకు వీలుగా గత ప్రభుత్వం గాజులరేగ సమీపంలో సుమారు 70 ఎకరాల్లో రూ.500 కోట్లతో ప్రభుత్వ వైద్యకళాశాల, బోధనాస్పత్రి, హాస్టల్ భవనాల నిర్మాణాన్ని తలపెట్టింది. వైద్య విద్యార్థులకు తరగతులు కూడా ప్రారంభించింది. బోధనాస్పత్రి నిర్మాణం కూడా దాదాపు పూర్తయింది. జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్ సమీపంలో ఉన్న ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిని 1500 పడకలతో విశాలంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉన్న బోధనాస్పత్రికి తరలించేందుకు కూటమి నేతలు అభ్యంతరం చెబుతున్నారు. వసతులు లేక పోయినా, రోగు లు ఇబ్బంది పడుతున్నా ఆస్పత్రిని తరలించేందుకు ససేమిరా అంటున్నారు. దీంతో రోగులతో పాటు వైద్యసేవలందించేందుకు వైద్య విద్యార్థులు, ప్రొఫెసర్లకు తిప్పలు తప్పడం లేదు. కోట్లాది రూపాయలు వెచ్చించి విశాలమైన భవనాలు నిర్మించిన వైద్య కళాశాలకు ఆస్పత్రిని తరలించకపోవడంపై జనం మండిపడుతున్నారు. ఇప్పటికే పలువురు కలెక్టరేట్‌లో జరిగిన పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్ అంబేడ్కర్‌కు వినతులు కూడా అందజేశారు. సర్వజన ఆస్పత్రి, ఘోషా ఆస్పత్రిలో కలిపి కేవలం 500 బెడ్‌లే ఉన్నాయని, ఇన్‌పేషేంట్ల సంఖ్య పెరిగిన సమయంలో సరిపడడంలేదని, ఒకే బెడ్‌పై ఇద్దరు ముగ్గురు రోగులు సేవలు పొందాల్సి వస్తోందని, బోధనాస్పత్రి వద్దకు సర్వజన ఆస్పత్రిని తరలించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
ఆస్పత్రికి అధిక సంఖ్యలో రోగులు వస్తున్నారు. రోజుకి 1200 వరకు ఓపీ నమోదవుతుండగా, వీరిలో 90 నుంచి 100 మంది వరకు ఆస్పత్రిలో ఇన్ పేషేంట్స్‌గా చేరుతున్నారు. ఆస్పత్రిలో 368 పడకలు మాత్రమే ఉన్నాయి. ఇన్ పేషేంట్లు 400 నుంచి 450 మంది వరకు ఉంటున్నారు. దీంతో పడకలు చాలక ఒకే బెడ్‌పై ఇద్దరిని ఉంచి చికిత్స అందిస్తున్నారు.
బెడ్స్ చాలకపోవడం వల్లే...
వ్యాధుల సీజన్ కావడంతో రోగులు అధిక సంఖ్యలో ఆస్పత్రికి వస్తున్నారు. సాధ్యమైనంతవరకు ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నాం. బెడ్స్ చాలాక పోవడం వల్ల ఒకేబెడ్‌పై ఇద్దరు చికిత్స తీసుకోవడానికి అంగీకరించేవారికి చికిత్స అందిస్తున్నాం.
– డాక్టర్ సంబంగి అప్పలనాయుడు,
సూపరింటెండెంట్,
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి
ఒకే బెడ్‌పై ఇద్దరు రోగులకు చికిత్స
ఒకే బెడ్‌పై ఇద్దరు రోగులకు చికిత్స
ఒకే బెడ్‌పై ఇద్దరు రోగులకు చికిత్స
ఒకే బెడ్‌పై ఇద్దరు రోగులకు చికిత్స