
హెచ్‌ఐవీపై అవగాహన కలిగి ఉండాలి
● జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి రాణి
విజయనగరం ఫోర్ట్: హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగిఉండాలని జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ కె.రాణి తెలిపారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద బుధవారం నిర్వహించిన ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత సత్ప్రవర్తన కలిగి ఉండాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. హెచ్‌ఐవీ బారిన పడితే జీవితం అంధకారం అవుతుందన్నారు. వ్యాధి వచ్చిన తర్వాత బాధపడేకంటే రాకుండా జాగ్రత్తలు వహించాలని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కె.రేఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి ప్రోగ్రాం మేనేజర్ ఉమామహేశ్వరరావు, సూపర్ వైజర్ బద్రి, గిరి, శ్రీనివాస్, మేఘన, తదితరులు పాల్గొన్నారు.
ప్రతీ పనికి ఒక రేటు
● రెవెన్యూ సిబ్బంది తీరుపై జేసీకి రైతు సంఘం ఫిర్యాదు
విజయనగరంఫోర్ట్: జిల్లాలో పనిచేస్తున్న పలువురు రెవెన్యూ సిబ్బంది ప్రతీ పనికి ఓ రేటు నిర్ణయించారు. భూముల రీసర్వే, మ్యుటేషన్ కోసం సెంటుకు రూ.500 నుంచి రూ.1000 డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకుంటే పనిచేయడం లేదని, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ జేసీ సేతుమాధవన్‌కు రైతు సంఘం కార్యదర్శి బుద్దరాజు రాంబాబు బుధవారం ఫిర్యాదు చేశారు. రాజకీయ బ్రోకర్లు ద్వారా డబ్బులు ఇచ్చిన వారికే పనిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎరువుల అధిక ధరలను కట్టడి చేయాలని, ఈక్రాప్ బుకింగ్ లోపాలను సరిచేయాలని విన్నవించారు. జేసీని కలిసిన వారిలో రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి వర్మ, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాములు, పైడిపినాయుడు పాల్గొన్నారు.
వచ్చారు.. వెళ్లారు..
విజయనగరం: శాప్ చైర్మన్ రవినాయుడు జిల్లా పర్యటన వచ్చారు... వెళ్లారు అన్న చందంగా సాగింది. ముందస్తుగా ప్రకటించిననిర్ణీత సమయం కన్నా ఆలస్యంగా వచ్చిన చైర్మన్ కోసం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారులతో పాటు, వివిధ అసోసియేషన్ ప్రతినిధులు వేచి చూడాల్సి వచ్చింది. జిల్లా కేంద్రంలోని పలు క్రీడా మైదానాలను స్థానిక ఎమ్మెల్యే అదితిగజపతి రాజుతో కలిసి బుధవారం పరిశీలించారు. జిల్లాను స్పోర్ట్స్ హబ్‌గా తయారు చేస్తామని, దశలు వారీగా క్రీడా మైదానాలను ఆధునీకరిస్తామని చెప్పారు. స్పోర్ట్స్ స్కూల్ బిల్డింగ్‌ను త్వరలోనే పూర్తిచేసి స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభిస్తామని, స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. కేంద్రం నిధులతో విజ్జి స్టేడియంలో 400 మీటర్లు సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్‌ను, హాకి కోర్టును ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ పనులన్నీ ఎప్పటిలోగా పూర్తిచేస్తామన్నది చెప్పకపోవడంపై క్రీడాకారులు పెదవి విరుస్తున్నారు. ఆయన వెంట కె.జగదీశ్వరి, ఎం.డి.రమేష్, పీబీఎన్ రాజు ఉన్నారు.

హెచ్‌ఐవీపై అవగాహన కలిగి ఉండాలి

హెచ్‌ఐవీపై అవగాహన కలిగి ఉండాలి