
చర్చించడమేనా..! పరిష్కరించరా...?
విజయనగరం అర్బన్:
జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి పనుల ప్రతిపాదనలు, పనుల మంజూరుకు చక్కని వేదిక... జిల్లా అభివృద్ధి సమావేశం(డీఆర్‌సీ). కూటమి ప్రభుత్వం వచ్చాక డీఆర్‌సీకి అర్థమే మారిపోయే పరిస్థితి. వివిధ సమస్యలపై చర్చించడమే తప్ప పరిష్కారం కనిపించడంలేదని జిల్లా ప్రజలు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి నాలుగు సార్లు సమావేశాలు నిర్వహించినా స్వపక్ష ప్రజాప్రతినిధులు తీసుకొచ్చిన సమస్యలను కూడా పరిష్కరించిన దాఖలాలు లేవు. ఎప్పటికప్పుడు ప్రజలకు క్షేత్రస్థాయిలో వచ్చిన సమస్యలతో పాటు రాష్ట్రస్థాయిలో నిధులు అవసరమైన సమస్యలను పరిష్కరించేందుకు కూటమి నేతలు చొరవ తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు లేకపోవడం వల్ల జిల్లా అభివృద్ధి సమావేశాన్ని మమ అనిపించేస్తున్నారని, జిల్లా ప్రజల సమస్యలపై చిత్తశుద్ధితో చర్చసాగడంలేదన్న వాదన వినిపిస్తోంది.
● మే నెలలో జరిగి డీఆర్సీ సమావేశంలో చర్చకు వచ్చిన రోడ్లు భవనాల శాఖ ప్రతిపాదిత పనులు ఇంకా ప్రారంభించలేదు. పూర్తిగా శిథిలమైన బొబ్బిలి–తెర్లాం రోడ్డు, బాడంగి మండలంలోని ఆకులకట్ట– పినపెంకి రోడ్డు, జిల్లా కేంద్రంలోని ఐస్ ఫ్యాక్టరీ కూడలి నుంచి ఐనాడ రోడ్డు, రాజాం–పాలకొండ రోడ్డు, రణస్థలం–రామతీర్థం రోడ్ల పనులకు ప్రతిపాదనలన్నీ మంజూరు చేసినట్టు చెబుతున్నా నిధులు విడుదలకాలేదు. దీంతో పనులు ప్రారంభించలేదు.
● జిల్లాలో తల్లికివందనం పథకం అందలేదంటూ సుమారు 18వేల మంది పీజీఆర్‌ఎస్‌లో దరఖాస్తు చేశారు. వీరిలో 12వేల మంది దరఖాస్తులు పరిశీలించి అర్హులుగా అధికారులు నిర్ధారించారు. వీరి ఖాతాలకు ఇప్పటివరకు డబ్బులు జమకాలేదు. ఎప్పుడు నిధులు విడుదల చేస్తారో తెలియదు. దీనిపై డీఆర్సీలో కొందరు నేతలైనా ప్రస్తావించి పరిష్కారానికి కృషిచేస్తారని లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
● వ్యవసాయం రంగంలో సేవలు మరింత దిగజారిపోయాయి. ఖరీఫ్ సీజన్‌లో రైతుకు ఎరువు కొరత వెంటాడుతోంది. అన్నదాత సుఖీభవ నిధులు చాలామంది కౌలురైతులు, డీ పట్టా భూములున్న రైతుకు జమకాలేదు. కొందిరికి పీఎం కిసాన్ నిధులు మాత్రమే జమయ్యాయి. వీటికి పరిష్కారం చూపాలి.
● కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలలవుతున్నా స్పౌజ్ పింఛన్లు మినహా ఏ ఒక్కరికీ కొత్త పింఛన్లు మంజూరు కాలేదు. మరోవైపు జిల్లాలో 25వేల మంది పింఛన్లు రద్దుచేసింది. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం జరిగే డీఆర్‌సీలో ప్రజాప్రతినిధులు ఈ సమస్యలను ప్రస్తావిస్తారని ఎదురు చూస్తున్నారు.
● జలాశయాల్లో నీరున్నా ఆయకట్టుకు అందడంలేదు. సాగునీటి కాలువలు సకాలంలో బాగుచేయకపోవడమే దీనికి కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. దీనికి పరిష్కారం చూపుతారోలేదో చూడాల్సిందే.
● కొత్త రేషన్ కార్డుల కోసం వేలామంది దరఖాస్తు చేశారు. ఇప్పటివరకు కొత్తగా ఒక్కరికీ మంజూరు కాలేదు.
● జిల్లాలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. బాగుచేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
నేడు ఇన్‌చార్జ్ మంత్రి ఆధ్వర్యంలో డీఆర్సీ