విజయనగరం అర్బన్: రానున్న ఐదు రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతారవరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగమంతా అప్రమతంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మండల ప్రత్యేకాధికారులు, ఈఓపీఆర్‌డీలు, మున్సిపల్ కమిషనర్లతో ఆయన బుధవారం వెబెక్స్‌లో మాట్లాడారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులంతా వారి ప్రధాన కేంద్రాల్లోనే ఉండాలని, ఏ ఒక్కరికీ సెలవులు మంజూరు చేయడం జరగదని స్పష్టం చేశారు. పూసపాటి రేగ, భోగాపురం మండలాల్లో అధికారులు ఎక్కువ దృష్టి పెట్టాలని, మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చూడాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఎటువంటి ప్రాణ, ధన నష్టం జరగకుండా చూడాలని సూచించారు. ఆర్‌డబ్ల్యూస్ అధికారులు పైప్‌లైన్లను తనిఖీ చేయాలని, మంచినీటి పైపులు ఉన్నచోట డ్రైనేజీ పైపులు లేకుండా చూడాలని, ప్రజలకు నురక్షిత తాగు నీరందించాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా అత్యవసర మందులు, క్లోరిన్, బ్లీచింగ్ తదితర సామగ్రితో సిద్ధం ఉండాలని తెలిపారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం 089222 36947 ఏర్పాటుచేశామని, 24 గంటల పాటు సిబ్బంది డ్యూటీలో ఉంటారని, అత్యవసర సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
2 వేల గృహనిర్మాణాలు పూర్తి చేయాలి
ఆగస్టు నెలాఖరులోగా జిల్లాలో 2 వేల గృహ నిర్మాణాలు పూర్తిచేసేలా ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. జిల్లాలో పీఎంఏవై అర్బన్, గ్రామీణ కింద 72,496 గృహాలు మంజూరు కాగా 49,127 గృహాలు పూర్తయ్యాయని, మిగిలినవి వివిధ స్థాయిల్లో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ మురళీ మోహన్ పాల్గొన్నారు.
ఉద్యోగులకు సెలవులు
మంజూరు చేయం
కలెక్టర్ డాక్టర్
బీఆర్ అంబేడ్కర్