
పైడితల్లి జాతర తేదీలు ఖరారు
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి జాతర తేదీలు ఖరారైనట్టు ఆలయ ఇన్‌చార్జి ఈఓ కె.శిరీష బుధవారం తెలిపారు. ఆలయ ఆవరణలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఉత్సవ నిర్వహణ తీరును వివరించారు. సెప్టెంబర్ 12న శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మండల దీక్షలు ప్రారంభమవుతాయని తెలిపారు. అదేరోజు చదురుగుడి వద్ద ఉదయం 9.30 గంటలకు, వనంగుడి వద్ద 11 గంటలకు పందిరిరాట వేస్తామన్నారు. అక్టోబరు 2న అర్ధమండల దీక్షలు ఉంటాయన్నారు. అక్టోబర్ 6న తొలేళ్ల ఉత్సవం, 7న సిరిమానోత్సవం, 14న పెద్దచెరువులో తెప్పోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. 19న సాయంత్రం 5.30 గంటల నుంచి వనంగుడి వద్ద కలశ జ్యోతి ఊరేగింపు, 21న మంగళవారం ఉయ్యాలకంబాల మహోత్సవం, 22న చండీహోమం, పూర్ణాహుతి, దీక్షావిరమణ ఉదయం 8 గంటల నుంచి వనంగుడి వద్ద నిర్వహిస్తామన్నారు. దీంతో ఉత్సవం ముగుస్తుందన్నారు. సమావేశంలో ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, ఆలయ సూపరింటెండెంట్ రమణి, ఏడుకొండలు, తదితరులు పాల్గొన్నారు.