
గురజాడ ఇంటిలో తాగుబోతు హల్‌చల్
● కోటవెనుక గోడ ఎక్కి మహాకవి ఇంట్లోకి చొరబడిన దొంగ
● పుస్తకాలను విసిరేసిన వైనం
● ఆవేదనలో సాహితీవేత్తలు
విజయనగరం టౌన్: విచ్చలవిడిగా దొరుకుతున్న మద్యం సేవించి.. ఆ మత్తులో మహాకవి గురజాడ ఇంటిలోకి కోట వెనుక భాగం నుంచి ఓ దొంగ మంగళవారం వేకువజామున చొరబడ్డాడు. మహాకవి రచనలు తప్పితే అక్కడ ఏమీ కనిపించకపోయే సరికి... ఆ పుస్తకాల విలువ తెలియని తాగుబోతు వాటిని గోడమీదనుంచి బయటకు విసిరేశాడు. చిందరవందర చేశాడు. మద్యం మత్తులో తూగుతూ గోడపై నుంచి దూకేసి అక్కడే మత్తులోకి జారు కున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
మహాకవి రచనలకు భద్రత కరువు?
మహాకవి గురజాడ రచనలను భద్రం చేయాల్సిన ఆర్కియాలజీ విభాగం, జిల్లా అధికార యంత్రాంగం ఎటువంటి చర్యలు చేపట్టలేదు. మహాకవి ఇంటిని పరిరక్షణ చేయమని, పక్కన ఉన్న ఖాళీ స్థలం వల్ల స్మారకభవనానికి ఇబ్బందులు వస్తున్నాయని, అధికారులకు పలుమార్లు వినతులు అందజేసినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. తాజా ఘటనతో మహాకవి అభిమానులు, సాహితీ సంఘాల ప్రతినిధులు ఆవేదన చెందుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి మహాకవి రచనలకు భద్రత కల్పించాని కోరుతున్నారు.
మహాకవి.. మా పాలకులను మన్నించుమా...
విజయనగరం గంటస్తంభం: తెలుగు జాతికి తన రచనలతో వెలుగు దారి చూపిన మహోన్నత వ్యక్తి, కన్యాశుల్కం నాటక రచయిత, మహాకవి గురజాడ అప్పారావు గృహానికి, ఆయన సాహిత్య సంపదను కాపాడడంలో పాలకులు విఫలమయ్యారని జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి ఆరోపించారు. ఒక తాగుబోతు గురజాడ అప్పారావు గృహంలోకి చొరబడి అక్కడి ఫ్యాన్లు, విలువైన పుస్తకాలు, వస్తువులు చిందరవందర చేసిన విషయం తెలుసుకుని పౌర వేదిక సభ్యులతో కలిసి గురజాడ గృహాన్ని మంగళవారం సందర్శించారు. గురజాడ ఇందిర, ప్రసాద్‌లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గురజాడ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ గురజాడ జయంతి, వర్ధంతి సభల్లో అధికారులు, నాయకులు ఊదరగొట్టే ప్రసంగాలు చేస్తూ వెంటనే మర్చిపోతున్నారన్నారు. గురజాడ గృహం పరిసరాలను ఉచ్చలదొడ్డి మాదిరిగా తయారుచేశారన్నారు. అపరిశుభ్రతలో భవనం ఉన్నా పట్టించుకునేవారే కరవయ్యారన్నారు. మద్యం మత్తులో ఓ దొంగ ఇంటిలో చొరబడి, విలువైన పుస్తకాలను గోడబయ టకు విసిరేయడాన్ని చూస్తే భద్రతలోని డొల్లతనం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. భవన నిర్వహణ బాధ్యతను విజయనగరం కార్పొరేషన్, జిల్లా టూరిజం, పురావస్తు శాఖ అధికారులు తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. గురజాడ అభిమాను లు దేశవ్యాప్తంగా ఉన్నారని, ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చూసి వారంతా ఆవేదన చెందుతున్నారన్నారు. గురజాడ గౌరవం కాపాడే దిశగా మంత్రి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పౌర వేదిక సభ్యు లు ప్రభాకరరావు, రామచంద్ర రాజు, రామ్మోహన్‌రావు, పద్మావతి, కనకాచారి, గోపి పాల్గొన్నారు.

గురజాడ ఇంటిలో తాగుబోతు హల్‌చల్

గురజాడ ఇంటిలో తాగుబోతు హల్‌చల్

గురజాడ ఇంటిలో తాగుబోతు హల్‌చల్