
బొబ్బిలిలో రెడ్‌బుక్ రాజ్యాంగం!
బొబ్బిలి: ఇప్పుడున్నది మా ప్రభుత్వం.. నడుస్తున్నది రెడ్‌బుక్ రాజ్యాంగం.. ఇక్కడ బంకును మేమే నిర్వహిస్తాం.. తక్షణమే ఖాళీచేసి వెళ్లిపో.. లేదంటే లారీలను అడ్డుగా పెడుతాం.. బంకులోకి వాహనాలు రాకుండా అడ్డుకుంటాం.. వ్యాపారమే సాగనీయం... ఇదీ బొబ్బిలి పట్టణంలోని పాతకోర్టు జంక్షన్‌లోని హెచ్‌పీ పెట్రోల్‌బంకు నిర్వాహకునికి స్థానిక నేతల నుంచి ఎదురైన బెదిరింపులు. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని లొకర్నో ఏజెన్సీకి ఉన్న స్థలంలో హెచ్‌పీ పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసింది. స్థల యజమాని మృతి చెందారు. తదనంతరం కంపెనీకి సమర్పించాల్సిన డాక్యుమెంట్ల విషయంలో ఉన్న సమస్యల కారణంగా స్థల యజమానికి కంపెనీ ఏళ్ల తరబడి అద్దె చెల్లింపు పెండింగ్‌లో పెట్టింది. పెట్రోల్ బంక్ లైసెన్సుదారు, సామర్లకోటకు చెందిన దళితుడైన చక్రవర్తి ఇక్కడ బంకును నిర్వహిస్తున్నారు. వ్యాపారం ఆపేయాలని స్థానిక నేతల నుంచి ఆయనకు హెచ్చరికలు వచ్చాయి. లైసెన్సు తమకు వదిలేయాలని, నిర్వహణ చూసుకుంటామంటూ బెదిరించారు. ఎమ్మెల్యేను కలవాలంటూ ఆదేశాలిచ్చారు. చేసేదిలేక ఆయన స్థానికంగా బంకులు నిర్వహిస్తున్న విజయ్, రెడ్డిల సహాయం అర్ధించారు. వారి సూచనలతో ఎమ్మెల్యేకు సమస్య చెప్పేందుకు వెళ్లగా కొందరు నాయకులు కలవనీయలేదు. బంక్‌కు లారీని అడ్డం పెట్టడంతో వ్యాపారం తగ్గిపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు భయపడి విజయనగరం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్ అంబేడ్కర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ డీఎస్‌ఓ మురళీనాథ్‌ను విచారణకు ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం స్థానిక పౌరసరఫరాల ఉపతహసీల్దార్ రెడ్డి సాయికృష్ణతో కలిసి పెట్రోల్ బంక్‌కు వెళ్లి విచారణ జరిపారు. లైసెన్సు ఎంత వరకూ ఉంది. స్థల లైసెన్సు, బంక్ నిర్వాహణకు సమయం ఎంత అనే కోణంలో విచారణ చేశారు. బంకుకు అడ్డంగా పెట్టిన లారీలను పరిశీలించారు. ఈ విషయమై మురళీనాథ్‌ను ప్రశ్నించగా కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణకు వచ్చాననీ, ఇక్కడి పరిస్థితులపై కలెక్టర్‌కు నివేదిక అందజేస్తానన్నారు.
పెట్రోల్ బంక్ నిర్వహించనీయకుండా బెదిరింపులు
బంకులోకి వాహనాలు రాకుండా అడ్డుగా పెడుతున్న లారీలు
కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన నిర్వాహకుడు
డీఎస్‌ఓను విచారణకు ఆదేశించిన కలెక్టర్

బొబ్బిలిలో రెడ్‌బుక్ రాజ్యాంగం!