
న్యాయవాదులతో ప్రీ సిట్టింగ్ లోక్ అదాలత్
విజయనగరం లీగల్: వచ్చేనెల 13వ తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం నేషనల్ ఇన్సూరెన్స్, బజాజ్ జనరల్ ఇన్సూరెన్‌న్స్, శ్రీరామ్ జనరల్ ఇన్సూరెనన్స్ కంపెనీల మేనేజర్లు, ఇన్సూరెన్స్ కంపెనీ న్యాయవాదులతో ప్రీ సిట్టింగ్ లోక్ అదాలత్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా 12 ప్రమాద బీమా కై ్లమ్ కేసులు రాజీకి వచ్చినట్లు ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. కార్యక్రమంలో ఫ్యామిలీ కోర్టు జడ్జి కె.విజయ కల్యాణి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణ ప్రసాద్, ఇన్సూరెనన్స్ కంపెనీ అధికారులు పాల్గొన్నారు.
నులిపురుగుల నివారణతో పిల్లలకు ఆరోగ్యం: కలెక్టర్ అంబేడ్కర్
గంట్యాడ: పిల్లల్లో నులిపురుగుల నివారణతో ఆరోగ్యం సిద్ధిస్తుందని, పోషకాహారలోపం తొలగి ఆరోగ్యంగా పెరుగుతారని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. ఏడాది నుంచి 19 ఏళ్ల వయస్సు మధ్యన ఉన్న పిల్లలు, విద్యార్థులందరితో ఆల్బెండజోల్ మాత్రలు మింగించాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు సూచించారు. డీ వార్మింగ్ డే సందర్భంగా గంట్యాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో మంగళవారం ఆల్బెండజోల్ మాత్రలు మింగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడుపులోని నులిపురుగుల నివారణకు ప్రతీ ఒక్కరూ ఆల్బెండజోల్ మాత్రను ఒకే డోస్‌గా వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఈఓ మాణిక్యంనాయుడు, ఆర్‌బీఎస్‌కే కో ఆర్డినేటర్ డాక్టర్ సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ నీలకంఠేశ్వర రెడ్డి, డాక్టర్ హేమలత, పాఠశాల హెచ్‌ఎం ఝాన్సీ, తదితరులు పాల్గొన్నారు.
పాత మార్కొండపుట్టిలో గజరాజులు
కొమరాడ: తోటపల్లి ముంపు ప్రాంతమైన పాత మార్కొండపుట్టి గ్రామ పరిసరాల్లో మంగళవారం ఏనుగులు సంచరించాయి. వరి, పత్తి, కూరగాయలు, అరటి పంటలను నష్టపరుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏనుగుల తరలింపునకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.