
పస్తులతో హాస్టల్ విద్యార్థుల నిరసన
శృంగవరపుకోట: భోజనం బాగులేదంటూ ఎస్.కోట పట్టణం పుణ్యగిరి రోడ్డులో ఉన్న గిరిజన బాలుర సంక్షేమ వసతి గృహం విద్యార్థులు మంగళవారం ఆందోళన చేశారు. పస్తులతో ఉంటూ నిరసన తెలిపారు. చాలా రోజులుగా హాస్టల్‌లో మెనూ పాటించడం లేదని, భోజనం తినలేకపోతున్నామని వాపోయారు. ఒక్క ఫ్యాన్‌కూడా లేకపోవడంతో దోమలతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విజయనగరంలో ఉన్న ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయకార్యదర్శి రమేష్, నాయకులు మహేష్, చైతన్య స్పందించారు. భోజనం బాగులేదని చెప్పిన విద్యార్థులపై వార్డెన్ సత్యనారాయణ బెదిరింపులకు దిగుతున్నారని, తక్షణమే ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళన అంశాన్ని వార్డెన్ వద్ద ప్రస్తావింగా ఇటీవల కురిసిన పిడుగుల వానకు ఫ్యాన్లు పాడయ్యాయని, రెండు రోజుల్లో బాగుచేయిస్తామని చెప్పారు.