
15న ప్రతి ఇంటా మువ్వన్నెల రెపరెపలు
విజయనగరం: దేశభక్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్రమోదీ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం చేపట్టారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. హర్‌ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా విజయనగరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కోట నుంచి గంటస్తంభం వరకు జాతీయ పతాక ప్రదర్శన ర్యాలీను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ సమైక్యతను చాటిచెబుతూ ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాలో ప్రతి ఇంటిపైన మువ్వన్నెల జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కోట వద్ద నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన హర్ ఘర్ తిరంగా సెల్ఫీ స్టాండ్‌లో జాతీయ జెండా చేబట్టుకొని మంత్రి సెల్ఫీ దిగారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతి రాజు, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్ పర్సన్ పాలవలస యశస్విని, మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య, పర్యాటక అధికారి కుమార స్వామి, వివిధ కళాశాలల విద్యార్థినీవిద్యార్థులు పాల్గొన్నారు.
గొయ్యి ఉంది.. జాగ్రత్త..!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పల్లె పండగ పేరుతో గుంతల రహిత రోడ్లుగా తీర్చిదిద్దుతామన్న ప్రకటనలు ఉత్తుత్తివే అని తేలిపోయింది. దీనికి విజయనగరంలో కనిపిస్తున్న గుంతల రోడ్లే నిదర్శనం. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నగరంలోని కోట నుంచి గంటస్తంభం వరకు సోమవారం ఉదయం నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్న పాలకులు, అధికారులకు గుంతల రోడ్లే స్వాగతం పలికాయి. కస్పా ఉన్నత పాఠశాల ముందు రోడ్డుపై ఉన్న గుంతవద్ద అప్రమత్తమై ముందుకు సాగారు. ఈ దృశ్యాన్ని చూసిన వారు ఇదేనా గుంతల రహిత రోడ్ల నిర్మాణమంటూ గుసగుసలాడారు.
దేశభక్తితో సాగిన హర్‌ఘర్ తిరంగా ర్యాలీ

15న ప్రతి ఇంటా మువ్వన్నెల రెపరెపలు