
స్పందించిన అధికారులు
తెర్లాం: తెర్లాం మండల కేంద్రంలోని జగనన్న కాలనీ సమీపంలో గల చెత్త కుప్పల్లో ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర బ్యాగ్‌లను ఎంఈఓ జె.త్రినాథరావు సోమవారం పరిశీలించారు. ఈ నెల 11న ‘సాక్షి’ దినపత్రికలో ‘చెత్త కుప్పల్లో విద్యార్థి మిత్ర బ్యాగ్‌లు’ అన్న శీర్షికన ప్రచురితమైన వార్తకు ఎస్‌ఎస్‌ఏ ఏపీసీ రామారావు, డీఈఓ మాణిక్యంనాయుడు స్పందించారు. చెత్త కుప్పల్లో ఉన్న విద్యార్థి మిత్ర స్కూల్ బ్యాగ్‌లను పరిశీలించాలని, అవి ఏ పాఠశాల నుంచి విద్యార్థులకు ఇచ్చారో వివరాలు తెలుసుకోవాలని ఎంఈఓ త్రినాథరావును ఆదేశించారు. ఈ మేరకు ఆయన చెత్త కుప్పలో వేసిన విద్యార్థి మిత్ర బ్యాగ్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ బ్యాగ్‌లు చిరిగిపోవడంతో వాటిని విద్యార్థులు చెత్త కుప్పలో పడేశారని, ఏ విద్యార్థి వాటిని చెత్తకుప్పలో వేశారో గుర్తించి వాటి స్థానంలో కొత్త బ్యాగులను విద్యార్థులకు అందజేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీనిపై నివేదిక తయారుచేసి డీఈఓకు పంపిస్తామని చెప్పారు.
చెత్త కుప్పల్లో ఉన్న ‘విద్యార్థి మిత్ర’ బ్యాగ్‌లు పరిశీలించిన ఎంఈఓ

స్పందించిన అధికారులు