
ఏటీఎం ధ్వంసం
పాచిపెంట: మండల కేంద్రంలో ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా బయట గల ఏటీఎంలో గుర్తు తెలియని వ్యక్తి శనివారం అర్ధరాత్రి చోరీకి యత్నించినట్లు ఎస్సై వెంకటసురేష్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం..శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తి ఏటీఎంలో చోరీకి ప్రయత్నం చేసి ముందుగా వెలుపల ఉన్న సీసీకెమెరాలు పూర్తిగా ధ్వంసం చేస్తున్న సమయంలో బ్యాంకు ఉద్యోగుల సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు వెళ్లాయి. మండల కేంద్రంలో నివాసముంటున్న బ్యాంకు ఉద్యోగులు బ్రాంచ్ వద్దకు వచ్చేసరికి, వారి రాకను గుర్తించిన ఆ వ్యక్తి పారిపోయాడు. దీనిపై బ్రాంచి మేనేజర్ దేవిగణేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
డివైడర్‌ను ఢీకొన్న లారీ
పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ కూడలి వద్ద మలుపులో పాలకొండ నుంచి వస్తున్న లారీ డివైడర్‌ను ఢీకొట్టడంతో డీవైడర్ ప్రారంభ భాగం శిథిలమైంది. అలాగే ఢీకొన్న లారీ మొరాయించి మలుపువద్దే నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్రస్థాయిలో అవస్థలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసులు మరోదారి నుంచి వాహనాలను ట్రాఫిక్ అంతరాయం లేకుండా మళ్లించే ప్రయత్రం చేశారు. శనివారం అర్ధరాత్రి లారీ ఢీకొని ఉండవచ్చునని స్థానికులు చెబుతున్నారు.
14.850 కేజీల గంజాయి స్వాధీనం
కొమరాడ: మండలంలో కూనేరు చెక్ పోస్టు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆదివారం 14.850 కేజీల గంజాయి పట్టబడిందని ఎస్సై కె.నీలకంఠం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందస్తు సమచారం మేరకు రాయగడ నుంచి పార్వతీపురం వైపు వస్తున్న ఆటోలో రెండు బ్యాగులతో ఇద్దరు ఆడ, మగ వ్యక్తులు పట్టబడ్డారన్నారు. వారిని అదుపుల్లోకి తీసుకుని విచారణ చేయగా మరో నిందితుడిని ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అయ్యండిగా గుర్తించామన్నారు. పట్టుబడిన ఇద్దరిపై కేసు నమోదు చేశామని గంజాయ అక్రమంగా తరలిస్తున్న వారిని తహసీల్డార్ సత్యన్నారాయణ సమక్షంలో విచారణ చేసి కేసు నమోదు చేసి అరెస్టు చేసి గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఆటో, బైక్ ఢీ: నలుగురికి గాయాలు
బొబ్బిలిరూరల్: మండలంలోని పారాది గ్రామం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.ఆదివారం సాయంత్రం తన కుమార్తె కుసుమాంజలికి జ్వరంగా ఉందని చిట్టి సీతారాపురం గ్రామానికి చెందిన ఎ.లక్ష్మణరావు మోటార్‌సైకిల్‌పై బయలు దేరి పారాది గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటోను ప్రమాదవశాత్తు ఢీకొట్టాడు. దీంతో ఆటో బోల్తా పడగా అందులో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో లక్ష్మణరావు తలకు తీవ్ర గాయాలు కాగా 108 వాహనంలో బొబ్బిలి సీహెచ్‌సీకి తరలించి ప్రాథమిక చికిత్సానంతరం అత్యవసర చికిత్స కోసం విజయనగరం తరలించారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.