
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
భోగాపురం: మండలంలోని ముక్కాం గ్రామానికి చెందిన గనగళ్ల రామచంద్ర(28) విజయనగరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై సూర్యకుమారి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గతంలో రామచంద్ర చేపలవేటకు వెళ్తూ కుటుబంతో జీవనం సాగించేవాడు. ఆయనకు భార్య యల్మాజీతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మధ్య చేపలవేటకు వెళ్లకుండా ఆటో నడుపుకుంటున్నాడు. ఈక్రమంలో మద్యానికి బానిసైన రామచంద్ర శనివారం మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వమని భార్యను అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఎంతకీ భార్య డబ్బులు ఇవ్వకపోవడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు హుటాహుటిన విజయనగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఈ మేరకు భార్య యల్మాజి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సూర్యకుమారి తెలిపారు.
గాయపడిన యువకుడు..
లక్కవరపుకోట: మండలంలోని అరకు–విశాఖ జాతీయ రహదారిలో గత నెల 29వ తేదీన రంగరాయపురం జంక్షన్ జోడుబందల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు బొబ్బరి వెంకటేష్ (24) కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. ఎస్.కోట నుంచి తన సొంత గ్రామం కొత్తవలస మండలం చిన్నమన్నిపాలెం ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఒక వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే.కాగా ఈ ప్రమాదంలో వెంకటేష్ తీవ్రంగా గాయపడడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు హెచ్‌సీ పాపారావు చెప్పారు. పోస్ట్‌మార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించామన్నారు.
పాము కాటుతో మహిళ..
విజయనగరం క్రైమ్: విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి పాత దుప్పాడకు చెందిన సత్యవతి (44)అనే మహిళ పాము కాటు వేయడంతో మృతి చెందినట్లు ఎస్సై దేవి ఆదివారం చెప్పారు. భర్తతో కలిసి ఆమె చల్లపేటలో పొలం పనులు చేసి తిరిగి వస్తున్న సమయంలో పొలం గట్టుపై నుంచి నడుస్తుండగా ఎడమ పాదంపై పాము కాటేయడంతో హుటాహుటిన భర్త నరసింగరావు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకు వెళ్లగా వైద్యచికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేస్తున్నట్లు వన్‌టౌన్ ఎస్సై దేవి చెప్పారు.
విద్యుత్‌షాక్‌తో యువకుడు..
చీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడి పట్టణంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన జగదీష్(23) అనే యువకుడు విద్యుత్‌షాక్‌తో మృతి చెందాడు. చీపురుపల్లి–గరివిడి ప్రధాన రహదారిని ఆనుకుని ఎస్‌డీఎస్ కళాశాల ఎదురుగా ఉన్న వాటర్ సర్వీసింగ్ కారుషెడ్డులో వాహనాన్ని వాష్ చేసేందుకు మోటార్ ఆన్ చేసి వాష్‌గన్ పట్టుకోగా షాక్ తగిలి మృతి చెందాడు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి