
రైతు సమస్యలు పట్టని ప్రభుత్వం
● ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, తలే రాజేష్
వంగర: రైతు సమస్యల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జి తలే రాజేష్ అన్నారు. పంటలు సాగుచేసేందుకు రైతులు నానా అవస్థలు పడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆదివారం మండల పరిధి కె.కొత్తవలసలో వారు విలేకరులతో మాట్లాడారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా తోటపల్లి కుడిప్రధాన కాలువ ద్వారా వంగర మండలంలోని అనేక గ్రామాలకు సాగునీరందలేదని, దమ్ములు చేసేందుకు సాగునీరు లేక రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. తోటపల్లి శివారు గ్రామాల రైతులు స్వచ్ఛందంగా కాలువల్లో పనులు చేసుకుని సాగునీటిని మళ్లించుకునే పరిస్థితి దాపురించిందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు అందుబాటులో ఎరువులు లేవని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ప్రతి గ్రామ సచివాలయంలో పుష్కలంగా కావలసినన్ని ఎరువులు అందుబాటులో ఉండేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని కూటమి ప్రభుత్వం తీరును ఎండగట్టారు. అన్నదాత సుఖీభవ పథకంలో అధిక సంఖ్యలో పేర్లు గల్లంతయ్యాయని, అర్హులైన రైతులకు పథకం వర్తింపజేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కార్యక్రమంలో, డాక్టర్ నరేంద్ర, ఎంపీపీ ఉత్తరావెల్లి సురేష్‌ముఖర్జీ, సర్పంచ్‌లు పోలిరెడ్డి రమేష్, గర్భాపు నారాయుడు, వైఎస్సార్‌సీపీ నాయకులు బొక్కేల వెంకటప్పలనాయుడు, కనగల పారినాయుడు, యలకల వాసునాయుడు, పెంకి గౌరునాయుడు, పెంకి లక్ష్మునాయుడు, పెంకి జంగంనాయుడు, వంజరాపు గోవిందరావు, పెంకి గౌరీశ్వరరావు, బెవర రామకృష్ణ, పొదిలాపు నారాయణరావు, పారిశర్ల రామకృష్ణ ఉన్నారు.