
రిమ్స్‌లో అరుదైన చికిత్స
శ్రీకాకుళం: శ్రీకాకుళం రిమ్స్ సర్వజన ఆస్పత్రి వైద్యులు అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న రోగికి చికిత్స అందించి ప్రాణాలు నిలబెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా ఏ ప్రభుత్వ ఆస్పత్రిలోనూ ఇలాంటి క్లిష్టమైన చికిత్స జరగలేదని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే... జూలై 8వ తేదీన సీతంపేటకు చెందిన సిద్ధమంగుల బారికి అనే 58 ఏళ్ల గిరిజన వృద్ధుడు తీవ్రమైన ఆయాసం, తలనొప్పితో పాటు చర్మం, నాలుక నీలం రంగులోనికి మారి రిమ్స్‌లో చేరాడు. అప్పటికే అతనికి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. దీంతో రిమ్స్ వైద్యులు రోగికి వెంటిలేటర్‌ను అమర్చి ఆక్సిజన్ అందిస్తూ చికిత్స ప్రారంభించారు. రోగిని అప్పటికే చాలా ఆస్పత్రుల్లో చూపించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పడంతో రిమ్స్‌కు తీసుకువచ్చారు. అతనికి అప్పటికి రక్తంలో ఆక్సిజన్ శాతం 53 మాత్రమే ఉంది. రిమ్స్‌లోని వైద్యులు ఐసీయూలో ఉంచి మందులు ఇస్తూ ప్రయత్నం చేశారు. ఓ దశలో రక్తంలో ఉన్న ఆక్సిజన్ శాతం 87కు చేరినప్పటికీ, అది ఎక్కువ రోజులు నిలబడలేదు. అప్పుడు రక్తాన్ని పరీక్ష నిమిత్తం విశాఖపట్నం పంపించారు. అక్కడ పరీక్షల్లో అతనికి ఉన్న వ్యాధి ‘మెథెమోగ్లోబినిమియా’గా నిర్ధారణ అయింది. అయితే అప్పటికే అతని పరిస్థితి కష్టతరంగా మారడంతో రిమ్స్‌లోని ఐదు విభాగాల వైద్యులు పరస్పరం చర్చించుకున్నారు. రోగికి శరీరంలో ఉన్న రక్తమంతా తీసి వేస్తూ, మరో వంక కొత్త రక్తాన్ని ఎక్కించడం ద్వారా రోగి ప్రాణాన్ని రక్షించవచ్చునని భావించారు. అయితే ఈ సమయంలో రోగి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉండే అవకాశాలు ఉండడంతో, రోగి బంధువులతో మాట్లాడారు. పరిస్థితిని వారికి వివరించారు.
ఏ రకమైన చికిత్స చేయకపోయినా వారం పది రోజుల్లో మృతి చెందే అవకాశం ఉండడంతో, బంధువులు చికిత్స జరపాలని వైద్యులను కోరారు. దీంతో వైద్యులు రంగంలోకి దిగి ఓ పక్క రక్తం ఎక్కిస్తూనే మరో వంక శరీరంలో ఉన్న రక్తాన్ని తొలగిస్తూ వచ్చారు. సుమారు 17 యూనిట్ల రక్తం అంటే 4.2 లీటర్ల రక్తాన్ని ఎక్కించారు. అదే స్థాయిలో పాత రక్తాన్ని తొలగించారు. అటు తర్వాత రక్తంలో ఆక్సిజన్ శాతం పరీక్షించగా 97 శాతం చేరుకోవడం అది నిలకడగా ఉండడంతో, క్రమేపి వెంటిలేటర్‌ను అటు తర్వాత ఆక్సిజన్ తొలగించి పరీక్షించారు. అప్పుడు కూడా ఆక్సిజన్ శాతం తగ్గకపోవడంతో పూర్తిగా ఆక్సిజన్ తీసివేశారు. మళ్లీ పరీక్షించగా రక్తంలో ఆక్సిజన్ శాతం 97 ఉండడం పల్స్, బీపీ రేటు నిలకడగా ఉండటంతో జూలై 24న రోగిని డిశ్చార్జ్ చేశారు. జూలై చివరివారంలో రోగిని మరోసారి రప్పించి పరీక్షలు చేయగా అప్పుడు కూడా నిలకడగానే ఉండడంతో మళ్లీ ఇంటికి పంపించేశారు. ఈ నెల 5వ తేదీన మళ్లీ తనిఖీ చేయగా అతను ఆరోగ్యకరంగా ఉన్నట్లు గుర్తించారు. మళ్లీ 15 రోజుల తర్వాత తనిఖీలకు రావాలని చెప్పి పంపించేశారు. రోగి మృతి చెందుతాడని భావించగా రిమ్స్ వైద్యులు విశేష సేవలు అందించి ప్రాణం నిలబెట్టారని వారికి బంధువులు ఆనందం వ్యక్తం చేస్తూ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. రోగికి వైద్య సేవలు అందించి ప్రాణం నిలబెట్టిన ఎమర్జెన్సీ విభాగం పేథాలజీ విభాగం, నెఫ్రాలజీ విభాగం జనరల్ మెడిసిన్ విభాగం, బ్లడ్ బ్యాంక్ విభాగం వైద్యులను పలువురు అభినందించారు.
ఐదు విభాగాల వైద్యుల కృషితో నిలబడిన ప్రాణం

రిమ్స్‌లో అరుదైన చికిత్స

రిమ్స్‌లో అరుదైన చికిత్స