
రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో శిక్షణ
చీపురుపల్లి: ఇండియన్ రెడ్‌క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో బేసిక్ ఫస్ట్ ఎయిడ్‌పై నిష్ణాతులైన వారితో శిక్షణ ఇవ్వనున్నట్టు ఆ సంస్థ రెవెన్యూ డివిజినల్ కోఆర్డినేటర్ బివి.గోవిందరాజులు చెప్పారు. పట్టణంలోని ఏరియా ఆసుపత్రి ఆవరణలో ఉన్న రెడ్‌క్రాస్ సంస్థకు చెందిన బ్లడ్ బ్యాంక్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరు ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతీ ఒక్కరికీ చివరి క్షణాల్లో గోల్డెన్ పీరియడ్ ఉంటుందని ఆ సమయంలో బేసిక్ ఫస్ట్ ఎయిడ్ అందించడం ద్వారా ప్రాణాలు కాపాడే అవకా శం ఉంటుందన్నారు. అలాంటి బేసిక్ ఫస్ట్ ఎయిడ్‌పై వివిధ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. దీని కోసం రెడ్‌క్రాస్ సంస్థ జిల్లా చైర్మ న్ కెఆర్‌డి.ప్రసాద్ ఆదేశాల మేరకు అబోతుల రమణ అనే నిష్ణాతులైన ఉద్యోగిని నియమించినట్టు తెలిపారు. ఎవరైనా మృతి చెందినప్పుడు నేత్ర దానం, అవయవ దానం చేసేందుకు ముందుకు వస్తే తక్షణమే రెడ్‌క్రాస్ 89192 649 93, 9247818604 నంబర్లకు సంప్రదించాలని సూచించారు.
కళ తప్పిన చంపావతి
గజపతినగరం:ప్రతి ఏటా ఇదే సీజన్‌లో నీటి తో నిండుగా దర్శనమిచ్చే చంపావతి నది నేడు నీరు లేక పిచ్చిమొక్కలతో దర్శనమిస్తోంది. వర్షాలు కురవకపోవడంతో నదిలో పిచ్చి మొక్కలు పేరుకుపోయాయి. మరోవైపు ఇసుకాసురులు ఎక్కడికక్కడ గోతులు తవ్వేసి ఇసుకను ఎత్తుకెళ్లడంతో మరింత ప్రమాదకరంగా కనిపిస్తుంది. ఆగస్టు నాటికి నీటితో నిండుగా ఉండాల్సిన చంపావతి నేడు జల కళ తప్పి బోసిపోయింది. ఈ పరిస్థితుల్లో దీని ఆయకట్టు రైతులు సాగుపై ఆందోళన చెందుతున్నారు.
ప్రైవేటీకరణ నిర్ణయాన్ని
ఉపసంహరించుకోవాలి
పార్వతీపురం రూరల్: పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆ పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జి.వరలక్ష్మి డిమాండ్ చేశారు. భోజన పథకం యూనియన్ జిల్లా రెండో మహాసభలు జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో ఆదివారం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వరలక్ష్మి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించే కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఈ పథకంలో దేశంలో 25 లక్షల మంది, రాష్ట్రంలో 85 వేల మంది సిబ్బంది నిర్వహణలో నిమగ్నమై ఉన్నారని తెలిపారు. వీరంతా నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలే అన్న విషయం పాలకులు గుర్తించాలన్నారు. ఇందులో ఎక్కువగా వితంతువులు, ఒంటరి మహిళలు ఉన్నారని వెల్లడించారు. మహిళ సాధికారత కోసం జపించే పాలకులు 11 సంవత్సరాలుగా భోజన కార్మికుల వేతనాలు పెంచకపోవడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బి.సుధారాణి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కేటాయింపులు అంతంతమాత్రంగానే ఉన్నాయని, ఇది సరికాదన్నారు.