
ఎత్తిపోతలకు చేతులెత్తేశారు..!
● వరినారు ముదురుతున్నా అందని సాగునీరు
● ఆవేదనలో రైతన్న
● కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం
● తక్షణమే జంఝావతి ఎత్తిపోతల పథకం
నుంచి నీరు సరఫరా చేయాలని డిమాండ్
కొమరాడ: జంఝావతి నదిపై 1975లో తలపెట్టిన ప్రాజెక్టు ఒడిశాతో ఉన్న చిన్నపాటి వివాదంతో నిలిచిపోయింది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి కృషితో 2006లో జంఘావతిపై రబ్బర్‌డ్యామ్ ఏర్పాటైంది. సుమారు 12వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. అక్కడే లో లెవల్ కెనాల్ నుంచి కుడికాలువ పరిధిలోని సుమారు 1000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఎత్తిపోతల పథకం నిర్మించారు. అప్పటి నుంచి ఏటా జూలై నెలలో ఎత్తిపోతల పథకం నుంచి సాగునీరు అందించేవారు. అయితే, ఈ ఏడాది వర్షాలు అనుకూలించకపోవడం, ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించేందుకు అధికారులు, పాలకులు చొరవచూపకపోవడంతో రాజ్యలక్ష్మీపురం, రావికర్రవలస, కుమ్మరిగుంట, కందివలస తదితర గ్రామాల్లోని భూములు సాగుకునోచుకోలేదు. ఓ వైపు వరినారు ముదిరిపోతున్నా ఎత్తిపోతల పథకం నుంచి సాగునీరు విడుదలకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోకపోవడంపై రైతులు మండిపడుతున్నారు.
ఎత్తిపోతల పథకంపై నిర్లక్ష్యం...
జంఝావతి ఎత్తిపోతల పథకం నిర్వహణపై నిర్లక్ష్యం చూపుతున్నారన్నది రైతుల వాదన. మరమ్మతులకు గురైన మోటార్లను సకాలంలో బాగుచేయకపోవడం, విద్యుత్ సరఫరాలో అంతరాయాలతను తొలగించకపోవడం వల్లే ఎత్తిపోతల పథకం నుంచి నీరు ఇప్పటికీ విడిచిపెట్టలేదని ఆరోపిస్తున్నారు. గతంలో ఈ పరిస్థితి ఉండేదికాదని, పథకంలో ఏ సమస్య ఎదురైనా వెంటనే పరిష్కరించేవారని చెబుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే కనీసం రైతుల గురంచి, పంటల సాగు గురించి పట్టించుకోవడంలేదని వాపోతున్నారు.

ఎత్తిపోతలకు చేతులెత్తేశారు..!