
రాజాంలో స్థిర పారిశుద్ధ్య వ్యవస్థ
● కేంద్ర జలశక్తి ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్
● రాజాం మండలం యూనిట్‌గా ఎంపిక
రాజాం: స్థిరమైన పారిశుద్ధ్య వ్యవస్థ నిర్మాణ దిశగా కేంద్ర జలశక్తి, జీఎంఆర్ ఫౌండేషన్‌లు సంయుక్తగా కృషిచేస్తున్నాయని కేంద్ర జలశక్తి ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ టీం లీడర్ సంజయ్‌కుమార్ పాండే, డిప్యూటీ కన్సల్టెంట్ శృతి మక్కర్ అన్నారు. స్వచ్ఛభారత్ ఫేజ్–2లో భాగంగా పారిశుద్ధ్య వ్యర్థాల నిర్వహణ కోసం కొత్త ప్రమాణాల ద్వారా గ్రామాలను లైట్ హౌస్ ఇనిషియేటివ్‌గా తయారుచేసేందుకు రాజాం మండలాన్ని ఎంపికచేసినట్టు వెల్లడించారు. ఈ మేరకు రాజాం మండలపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ శ్రీనివాసరావుతో పాటు ఆర్‌డబ్ల్యూఎస్ డీఈఈ రాజేష్, జేఈ జగన్మోహనరావు తదితరులతో కలిసి గురువారం ససమీక్షించారు. రాజాం మండలంలో పారిశుద్ధ్య పరిస్థితి, వ్యర్థాల నిర్వహణకు అవసరమైన వనరులు, వసతులపై ఆరా తీశారు. అనంతరం స్థానిక విలేకరులతో మట్లాడుతూ మెరుగైన పారిశుద్ధ్యం, పరిశుభ్రత కోసం ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా అమలుచేసేందుకు 15 రాష్ట్రాల్లో 75 గ్రామ పంచాయతీలను కేంద్ర జలశక్తి ఎంపికచేసిందన్నారు. ఇందులో రాజాంకు స్థానం దక్కిందని వెల్లడించారు. జీఎంఆర్ వీఎఫ్‌తో కలిసి రాజాంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. బ్లాక్ స్థాయిలో ఒక స్వచ్ఛ సాతీని నియమిస్తామన్నారు. కార్యక్రమంలో జీఎంఆర్ ఫౌండేషన్ ప్రోగ్రాం మేనేజర్ సాయి కిషోర్, హెచ్‌ఆర్‌డీ కన్సల్టెంట్ టి.సుధాకర్, ఎంఆర్‌సీ వైకుంఠరావు, జీఎంఆర్ వీఎఫ్ సభ్యులు పాల్గొన్నారు.