
తప్పుడు రిజిస్ట్రేషన్ కలకలం
భోగాపురం: స్థానిక సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన తప్పుడు రిజిస్ట్రేషన్‌పై కలకలం రేగింది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని గూడెపువలసకు చెందిన రైతు ఆళ్ల ముకుందరావు తాతయ్య పేరు మీద ఉన్న 2.49 ఎకరాల భూమిని, వారసత్వ ఆస్తిగా కుమారుడైన శంకాబత్తుల అప్పలగురువుకు వచ్చింది. ఆయన మృతి చెంది మూడేళ్లు అయినప్పటికీ.. బతికున్నట్లు బినామీ డాక్యుమెంట్లు సృష్టించి ఆ భూమిని ఇద్దరి పేరుమీద అన్‌లైన్ చేసేశారు. ఎలాంటి వన్‌బీ, గానీ, ఈసీ గాని చూడకుండా ఎక్కడో సృష్టించిన డాక్యుమెంట్ల ఆధారంగా తప్పుడు రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. దీనిపై భూహక్కుదారుడైన ఆళ్ల ముకుందరావు తనకు చెందాల్సిన భూమికి సంబంధించి రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్లి జరిగిదంతా చెప్పడంతో రిజిస్ట్రార్ ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ విషయం బయట పెట్టొద్దని దీనిపై పరిశీలిస్తానన్నారంటూ రిజిస్ట్రార్‌పై ముకుందరావు ఆగ్రహం వ్యక్తం చేశాడు. సర్వే నంబర్ 159–2లో ఎకరం భూమి అరం జ్యోతి పేరుమీద ఉండగా మళ్లీ అదే సర్వే నంబర్ మీద 2.49 ఎకరాల భూమిని రిజిస్టేషన్ చేయించేశారు. తనకు సంబంధించిన ఆస్తులను ఎలా తప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తారంటూ ముకుందరావు ప్రశ్నించాడు. డబ్బులకు అమ్ముడుపోయి ఇలా చేయాడం మీకు తగదని న్యాయం జరిగే వరకు విడిచి పెట్టనని అవసరమైతే కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్తానం టూ హెచ్చరించాడు. ముందుగా తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి ముకుందరావు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ రమణమ్మ ఆయనకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.
సబ్‌రిజిస్ట్రార్‌ను ప్రశ్నించిన రైతు