
ప్రైవేటు విద్యపై పర్యవేక్షణ లోపం
● గుర్తింపులేని ప్రైవేటు పాఠశాలపై కలెక్టరేట్‌కు ఫిర్యాదుల వెల్లువ ● ఈ విద్యాసంవత్సరంలో పీజీఆర్‌ఎస్‌కు 57 ఫిర్యాదులు ● ఒక స్కూల్‌కి గుర్తింపు తీసుకొని నాలుగు స్కూళ్లు నడుపుతున్న వైనం ● ప్రభుత్వ పాఠశాలల పిల్లలే లక్ష్యంగా ప్రవేశాల గాలం
విజయనగరం అర్బన్:
‘అనుమతులు లేకుండా విజయనగరం జిల్లా కేంద్రం నడిబొడ్డున చైతన్య భారతి ప్రైవేటు విద్యాలయం నిర్వహిస్తున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావినతుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో రెండుసార్లు ఫిర్యాదుచేశారు. రెండోసారి ఫిర్యాదు రావడంతో విద్యాశాఖ అధికారులపై కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సీరియస్ అయ్యారు. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండునెలలు కావస్తోందని, ఇంతవరకు క్షేత్రస్థాయి పరిశీలన చేయలేదా? అంటూ ఆగ్రహించారు. ఆయన ఆదేశాల మేరకు తనిఖీ చేసిన అధికారులు చైతన్య భారతి స్కూల్‌కు గుర్తింపులేదని నిర్ధారించి సీల్‌వేశారు. జిల్లా కేంద్రంలోనే ఎలాంటి గుర్తింపులేకుండా పాఠశాలలు నిర్వహిస్తుంటే జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. విద్యార్థుల భవితవ్యం ఏమవుతోందన్న అంశం చర్చనీయాంశంగా మారింది.’
ఫిర్యాదులు వస్తున్నా...
ప్రస్తుత విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి ఇంతవరకు వివిధ పాఠశాలలపై వివిధ సమస్యలపై పీజీఆర్‌ఎస్‌కు 57 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో అత్యధికం తల్లికి వందనం ఉంటే ప్రైవేటు స్కూళ్ల అక్రమ ఫీజుల వసూళ్లు, అసౌకర్యాలపై అధిక వినతులు అందాయి. విద్యాశాఖ అధికారుల క్షేత్రస్థాయి పర్యవేక్షణ లేకపోవడం వల్లే వసతుల లేమిపైనా ఫిర్యాదులు అందుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలు 434 నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. అయితే, చాలా పాఠశాలకు మైదానాలు, తాగునీటి సదుపాయం, గ్రాంథాలయాలు, పక్కా భవనాలు వంటివి లేవు. కొన్ని పాఠశాలలు పూర్తిగా రేకులషెడ్‌లలోను, పెట్రోల్ బంకుల సమీపంలో నిర్వహిస్తున్నారు.
ఒక స్కూల్ గుర్తింపుతో నాలుగు స్కూళ్ల ఏర్పాటు
బొబ్బిలి, విజయనగరం, చీపురుపల్లి, ఎస్.కోట, కొత్తవలస ప్రాంతాలతో పాటు వివిధ మండల కేంద్రాల్లో కొన్ని కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలు నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. ఒక అనుమతి తీసుకుని, పట్టణంలోగాని పక్క మండల కేంద్రంలోగాని ఒకే సంస్థ పేరుతో మూడు నుంచి నాలుగు శాఖలను నడుతున్నాయి. ప్రత్యేకించి రాష్ట్ర వ్యాప్తంగా పేరు పొందిన రెండు సంస్థలు ఇదే పద్ధతిలో విద్యాలయాలు నిర్వహిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. వీటి వెనుక ఉన్న రాజకీయ నేతల అండదండలతో వాటిజోలికెళ్లేందుకు అధికారులు భయపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ మండల కేంద్రాలు, పెద్ద గ్రామాల్లో సుమారు 29 పాఠశాలలు గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్నట్టు సమాచారం.
గుర్తింపులేని స్కూళ్లపై చర్యలు తీసుకుంటాం
విద్యాసంవత్సరం ప్రారంభమైనందున కొత్తగా పాఠశాలలకు అనుమతి, గుర్తింపు ఇవ్వడం లేదు. గుర్తింపులేని స్కూళ్లపై చర్యలు తీసుకుంటాం. సరైన నిబంధనలు అమలు చేయని పాఠశాలలు ఉంటే వాటి గుర్తింపును రద్దు చేస్తాం. పాఠశాలలను తనిఖీ చేయడంతోపాటు నిబంధనలు అమలయ్యేలా చూస్తాం.
– యు.మాణిక్యంనాయుడు, డీఈఓ