
నేను తాగుతూ ఉంటా.. బయట తాళం వేయండి..!
● మద్యం మత్తులో సిబ్బందికి
వంగర తహసీల్దార్ హుకుం
వంగర: మద్యం మందిరంగా తన చాంబర్‌ను మార్చిన ఒక తహసీల్దార్ ఉదంతమిది. ప్రజలను తీవ్ర ఆగ్రహానికి గురిచేసిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా వంగర మండల తహసీల్దార్ హరిరమణారావు తన చాంబర్‌లో గురువారం మద్యం మత్తులో ఊగిపోయారు. కార్యాలయ సిబ్బందితో ‘నేను లోపలే ఉంటాను.. మీరు బయట వ్యక్తులను లోపలకు పంపకుండా తాళం వేయాలి’ అంటూ అంతకుముందు ఆదేశించారు. అనంతరం ఆయన తన గదిలో మద్యం తాగుతూ మత్తులోకి జారుకున్నారు. ఈ తతంగాన్ని వివిధ పనులపై కార్యాలయానికి వచ్చిన వ్యక్తులు గమనించి మీడియాకు సమాచారం అందించారు. మీడియా సిబ్బంది అక్కడకు చేరుకుని సిబ్బందితో గది తాళాలు తీయించారు. ఊగిపోతూ కనిపించిన తహసీల్దార్‌ను చూసి అవాక్కయ్యారు. ఇటీవల ఏఎంసీ వైస్ చైర్మన్ పదవి దక్కించుకున్న అరసాడ గ్రామానికి చెందిన లచ్చుభక్తు ధనలక్ష్మిని కలిసేందుకు గురువారం తాహసీల్దార్ తన సిబ్బందితో వెళ్లారు. అక్కడ నుంచి తిరిగి వచ్చిన తహసీల్దార్ తన చాంబర్‌కు వెళ్లి మద్యం తాగినట్టు సమాచారం. అయితే కార్యాలయానికి ప్రతి నిత్యం తహసీల్దార్ మద్యం సేవించి వస్తున్నారని, కార్యాలయంలో కూడా మద్యం తాగి నిద్రిస్తుండడం పరిపాటిగా మారిందని సిబ్బంది చెబుతుండడం గమనార్హం. ఈ విషయంపై ఆర్డీఓ ఆశయ్య, తహసీల్దార్ హరిరమణారావును ఫోన్‌లో సంప్రదించే ప్రయత్నం చేసినా లిఫ్ట్ చేయలేదు. కాగా ఈ ఘటనపై కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్పందించారు. వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీస్ జారీచేశారు.

నేను తాగుతూ ఉంటా.. బయట తాళం వేయండి..!

నేను తాగుతూ ఉంటా.. బయట తాళం వేయండి..!