
నాటుతుపాకీల ఏరివేతకు కార్డన్ సెర్చ్
● ఎస్పీ వకుల్ జిందల్
విజయనగరం క్రైమ్: నాటు తుపాకులు వినియోగించడం చట్టరీత్యా నేరమని, గిరిజనులు, వేటగాళ్ల వద్ద ఉన్న నాటు తుపాకీల ఏరివేతే లక్ష్యంగా కార్డన్ సెర్చ్ నిర్వహించాలని ఎస్పీ వకుల్ జిందల్ పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని తన చాంబర్ నుంచి మూడు సబ్ డివిజ న్ల పోలీస్ అధికారులతో గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. లైసెన్సు లేకుండా తుపాకుల వినియోగించడం చట్టరీత్యా నేరమన్న విషయాన్ని గిరిజనులకు అవగాహన కల్పించాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అడవి పందుల నుంచి పంటలను రక్షించుకునేందుకు, వేటాడేందుకు కొంతమంది నాటు తుపాకులను అనధికారంగా వినియోగిస్తున్నట్టు మా దృష్టికి వచ్చిందన్నారు. క్షేత్ర స్థాయిలో నాటు తుపాకులు వినియోగించే వ్యక్తుల సమాచారాన్ని సేకరించాలన్నారు. సోదాల్లో గంజాయి, సారా, నాటు తుపాకులు లభ్యమైతే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలని ఎస్పీ సూచించారు. టెలికాన్ఫరెన్స్‌లో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, బొబ్బిలి డీఎస్పీ జి.భవ్యారెడ్డి, చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, పలువురు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.