హైదరాబాద్‌లో ప్రమాదం
పాలకొండ రూరల్: నగరపంచాయతీ పరిధి జంగాలవీధిలో నివాసముంటున్న దేవళ్ల శంకరరావు, ఉషారాణి దంపతుల ఒక్కగానొక్క కుమారుడు సందీప్(24) హైదరాబాద్‌లో జరిగిన ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. సందీప్ డిగ్రీ వరకూ చదువుకున్నాడు. ఉపాఽధి మార్గంలో భాగంగా తనకు ఇష్టమైన హోటల్ మేనేజ్‌మెంట్ పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఆరు నెలల క్రితం ఉద్యోగ అన్వేషణలో హైదరాబాద్ చేరాడు. అక్కడి జూబ్లీహిల్స్‌లో గల ఓ కేఫ్‌లో కొలువు పొందాడు.
కొడుకు అందుకొస్తున్నాడని తల్లిదండ్రులు భావిస్తున్న తరుణంలో విధి కన్నుకుట్టింది. కేఫ్ యాజమాన్యం సమకూర్చిన మూడంతస్తుల భవనంలో వసతి పొందుతున్న సందీప్ బుధవారం ఉదయం 5 గంటల సమయంలో భవనం పైనుంచి జారి పడిపోయాడు. ఈ విషయాన్ని సందీప్ సహచరులు పాలకొండలో ఉన్న తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. విషయం తెలుసుకుని ఉలిక్కిపడిన వారు హుటాహుటిన హైదరాబాద్ పయనమయ్యారు. సందీప్ తలకు గాయం కావడంతో గాంధీ ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలిస్తున్నట్లు సహచరులు తెలియజేయడంతో కంగారు పడ్డారు.
ఇంతలో సందీప్ తుదిశ్వాస విడిచాడన్న వార్త తెలియగానే షాక్‌కు గురైనట్లు తండ్రి శంకరరావు తెలిపాడు. తాను టైలరింగ్ చేస్తూ, తన భార్య మెప్మాలో అత్యంత చిన్న ఉద్యోగం చేస్తూ రెక్కల కష్టంపై పిల్లలను అల్లారు ముద్దుగా పెంచామని, వారి భవిష్యత్తు కోసం కన్న కలలు తీరకుండానే తిరిగిరాని లోకానికి చెయ్యెత్తు కొడుకు వెళ్లిపోయాంటూ తల్లిదండ్రులు రోదించారు. ఈ విషయం తెలియడంతో స్థానిక జంగాల వీధితోపాటు మృతుని బంధువులు, స్నేహితుల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఉపాధికోసం వెళ్లి..!