
‘విద్యాశక్తి’పై ఫ్యాప్టో అభ్యంతరం
విజయనగరం అర్బన్: విద్యాశాఖ అమలు చేస్తున్న విద్యాశక్తి కార్యక్రమంపై ఫ్యాప్టో అభ్యంతరం తెలిపింది. మొదట ఐచ్చికంగా ప్రకటించిన కార్యక్రమాన్ని ఇప్పుడు నిర్బంధంగా అమలు చేయడాన్ని ఫ్యాప్టో జిల్లా కమిటీ తప్పుబట్టింది. ఈ మేరకు కమిటీ ప్రతినిధులు డీఈఓ యు.మాణిక్యంనాయుడును బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం డీఈఓ కార్యాలయం బయట ఉపాధ్యాయ సంఘ నాయకులు మాట్లాడుతూ మొదట ఉపాధ్యాయ సంఘాల సమక్షంలో అధికారులు విద్యాశక్తి కార్యక్రమం ఐచ్చికమని స్పష్టంగా చెప్పారని, ఇప్పుడు మార్చి 31 వరకు తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వడం సరికాదన్నారు. ఇప్పటికే 10వ తరగతి విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహిస్తున్న తరుణంలో 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు కూడా అదేరీతిలో తరగతులు నిర్వహించమని చెప్పడం అన్యాయమన్నారు. డీఈఓను కలిసిని వారిలో ఫ్యాప్టో నాయకులు పాల్తేరు శ్రీనివాస్, జేఏవీఆర్‌కే ఈశ్వరరావు, ఎన్‌వీ పైడిరాజు, కె.జోగారావు, టి.సన్యాసిరాజు, ఎస్.భాస్కరరావు, కె.శ్రీనివాసరావు, సూరిబాబు, ఎం.ఎ.స్వామి, ఎన్.ఆదివిష్ణు, తదితరులు పాల్గొన్నారు.