దెబ్బకు ఠా..బెట్టింగ్ ముఠా..!
● ఐపీఎల్ బెట్టింగ్ యాప్ గుట్టురట్టు
● 11మంది నిందితుల అరెస్ట్
● విలేకరుల ముందు ప్రవేశపెట్టిన ఎస్పీ
● రూ 14లక్షల నగదు, ల్యాప్‌టాప్, 13మొబైల్స్ సీజ్
విజయనగరం క్రైమ్: ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ యాప్‌ల ద్వారా లక్షల రూపాయల సొమ్ము అక్రమంగా సంపాదిస్తున్న ముఠా గుట్టును బొబ్బిలి పోలీసులు రట్టు చేశారు. ఈ మేరకు విజయనగరం ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం విలేకరుల ముందు నిందితులను ప్రవేశపెట్టారు.ఈ సందర్భంగా బొబ్బిలి డీఎస్పీ భవ్యా రెడ్డితో కలిసి ఎస్పీ వకుల్‌జిందల్ మాట్లాడారు. బొబ్బిలి పోలీస్ సబ్ డివిజన్ పరిధి బొబ్బిలి పీఎస్ పరిధి శివరాంపురం మామిడి తోటలో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా ముఠా గుట్టురట్టయిందని ఎస్పీ తెలిపారు. పార్వతీపురం–మన్యం జిల్లాకు చెందిన ముషిడిపల్లి దివాకర్ ప్రధాన నిందితుడిగా బెట్టింగ్‌ల్లో డబ్బు సంసాదించాలనే ఉద్దేశంతో బెంగళూరుకు చెందిన నిరంజన్‌రెడ్డితో ఎంఓయూ కుదుర్చుకున్నాడు. రాధే ఎక్సేంజ్ అనే బెట్టింగ్ యాప్‌ను తీసుకుని అడ్మిన్‌గా ఉంటూ దాదాపు 200 మంది యువకులను ఈ యాప్‌ల ద్వారా ఆకర్షించాడు. కమీషన్ ఆశ చూపి యువతను నకిలీ బెట్టింగ్‌యాప్‌ల వలలో చేరుస్తున్నాడు. ఏజెంట్లుగా నియమించిన యువతతో బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేయిస్తూ కమీషన్ ఎరచూపి వాట్సాప్ లింకులు షేర్ చేస్తూ డబ్బులు సంపాదించేవాడని ఎస్పీ తెలిపారు. బెట్టింగ్ యాప్‌లను మరింతగా విస్తృతం చేయాలనే ఉద్దేశంతో పార్వతీపురం–మన్యం జిల్లాకు చెందిన నవీన్, సంతోష్‌లతో కలిసి నేషనల్ ఎక్సేంజ్ అనే మరో బెట్టింగ్ యాప్‌కు అడ్మిన్ అయి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతను ఆకర్షించి డబ్బులు సంపాదించడం లక్ష్యంగా పెట్టుకునే వారని విచారణలో వెల్లడైందన్నారు. ఇలా బెట్టింగ్‌లకు పాల్పడుతున్న 11 మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ చెప్పారు. అలాగే నిందితుల దగ్గర నుంచి రూ 14లక్షల నగదు, ల్యాప్‌టాప్, 13మొబైల్స్ స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు తెలిపారు.
పరారీలో నలుగురు నిందితులు
అయితే పరారీలో ఉన్న మరో నలుగురు అడ్మిన్‌లైన నిరంజన్‌రెడ్డి, సంతోష్ , కార్తీక్, నవీన్‌ల కోసం గాలిస్తున్నామన్నారు. ప్రధాన నిందితుడైన ముషిడిపల్లి దివాకర్ ఏజెంట్లకు 3 శాతం కమీషన్ ఇవ్వడంతో పాటు పొగొట్టుకున్న వ్యక్తుల నగదులో 50 శాతం సొమ్మును ఏజెంట్లకు ఇచ్చి వారిని బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేందుకు ప్రొత్సహించేవాడని ఎస్పీ వకుల్‌జిందల్ తెలిపారు. ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్‌ల ద్వారా డబ్బులు సంపాదించడం చట్ట వ్యతిరేకమని, జీవితాలు నాశనం చేసే బెట్టింగ్‌ల జోలికి ఎవరూ పోవద్దని ఈ సందర్భంగా ఎస్పీ సూచించారు.
సిబ్బందికి అభినందనలు
క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేయడంలో క్రీయాశీలకంగా వ్యవహరించిన బొబ్బిలి సీఐ సతీష్, ఎస్‌ఐ రమేష్, పీసీలు సత్యనారాయణ, సతీష్ కుమార్, ఎర్రంనాయుడు, అప్పారావులను ఎస్పీ అభినందించారు.


