మహాకవి గృహానికి మరమ్మతులు
● రూ.12 లక్షలు కేటాయించిన కలెక్టర్
● హర్షం వ్యక్తం చేస్తున్న సాహితీవేత్తలు
విజయనగరం టౌన్: మహాకవి స్వగృహం దీన స్థితిపై కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి స్పందించారు. మరమ్మతుల పనులకు రూ.12 లక్షలు కేటాయించారు. దీనిపై మహాకవి కుటుంబీకులు, సాహితీ వేత్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2025 సంవత్సరంలో మహాకవి స్వగృహంలో రెండు సార్లు దొంగలుపడ్డారు. విలువైన గ్రంథాలను చెల్లాచెదురు చేశారు. కుర్చీలు, తలుపులు విరగ్గొట్టారు. 12 అడుగులు పొడవు ఉండే పెరటి గోడ మట్టివేసేయడం వల్ల అదికాస్త నాలుగైదు అడుగులకు ఎగబాకింది. ఇంట్లోకి సులభంగా దూకి, దొంగతనాలకు పాల్పడిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. గోడవెనుక మట్టి తీసివేసి గోడపై ఐరెన్ పోల్స్‌వేసి ఇనుప కంచే వేయాలన్న ప్రతిపాదనలను సాహితీవేత్తలు చాలాసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మహాకవి వాడిన నూతి గట్టు వద్ద ఉన్న రెండు బాత్రూమ్‌లను తీసివేసి పూర్తిగా చదును చేయిస్తే సభలు పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుందని కోరారు. పాడైన తలుపులు, కిటికీల స్థానంలో కొత్తవి అమర్చాలని, రంగులు వేయాలని విన్నవించారు. ఎట్టకేలకు కలెక్టర్ స్పందించి సమస్య పరిష్కరించేందుకు అడుగు ముందుకువేయడం శుభపరిణామం.
మహాకవి స్వగృహానికి మరమ్మతులు చేపట్టేందుకు అధికార, ప్రజాప్రతినిధులు ముందుకు రావడం ఆనందంగా ఉంది. గత కొన్నాళ్లుగా మహాకవి స్వగృహంపై వివిధ సంస్ధల ప్రతినిధులు ముందుకు వచ్చి మహాకవి ఇంటిని కాపాడుకోవడానికి పలు తీర్మానాలు చేశారు. అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసి విన్నవించారు. నూతన సంవత్సరంలో మహాకవి ఇల్లు మరమ్మతులు పూర్తిచేసుకుని కొత్తరూపును సంతరించుకోనుంది.
– గురజాడ ఇందిర, గురజాడ అప్పారావు మునిమనవరాలు, విజయనగరం
మహాకవి గృహానికి మరమ్మతులు


