మాతాశిశు మరణాల కట్టడికి చర్యలు చేపట్టాలి
పార్వతీపురం: జిల్లాలో మాతా శిశుమరణాల కట్టడికి పటిష్టంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో మాతా శిశు మరణాల నివారణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణులను సకాలంలో ఆస్పత్రులకు తరలించేలా ‘102’ 108’ వాహనాలను సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. తక్కువ బరువుగల శిశువులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన పౌష్టికాహారం, ప్రభుత్వ పథకాలపై గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. మాతా శిశుమరణాలపై నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ పి.భాస్కరరావు, డీసీహెచ్‌ఓ ఎన్.నాగభూషణరావు తదితరులు పాల్గొన్నారు.


