గుట్టుచప్పుడుగా గుట్కా విక్రయాలు | - | Sakshi
Sakshi News home page

గుట్టుచప్పుడుగా గుట్కా విక్రయాలు

Jan 1 2026 1:48 PM | Updated on Jan 1 2026 1:48 PM

గుట్ట

గుట్టుచప్పుడుగా గుట్కా విక్రయాలు

గుట్టుచప్పుడుగా గుట్కా విక్రయాలు

ఒడిశా నుంచి అక్రమంగా దిగుమతి

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న అక్రమార్కులు

పార్వతీపురం: ప్రజల ప్రాణాలకు హాని కలిగించే పొగాకు ఉత్పత్తులను ఆహార భద్రత చట్టం కింద 2006లో అప్పటి ప్రభుత్వం నిషేధించింది. అయినా పట్టణాలనుంచి పల్లెల వరకు నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కొందరు వ్యాపారులు నిబంధనలను పక్కన పెట్టి పక్క రాష్ట్రం ఒడిశా నుంచి పట్టణాలకు సరఫరా చేసుకుని అక్కడి నుంచి మండలాలకు, పల్లెలకు పంపిణీ చేస్తున్నారు. ఇలా చేతులు మారేకొద్దీ వాటి ధరలు కూడా అమాంతం పెంచి అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. పక్కనే ఉన్న ఒడిశా నుంచి పార్వతీపురం మీదుగా విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు అక్రమంగా గుట్కా రవాణా చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే గుట్కాను ప్రభుత్వం నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసినప్పటికీ విక్రయాలు యథాతథంగా సాగుతున్నాయి. పార్వతీపురం పట్టణంతో పాటు మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో గుట్కా, పాన్‌పరాగ్‌, ఖైనీ ప్యాకెట్లను రహస్యంగా విక్రయిస్తూనే ఉన్నారు. ఒడిశా రాష్ట్రంలోని రాయగడ నుంచి గుట్కా, ఖైనీ ప్యాకెట్లు తెస్తున్న ముఠా.. స్థానికంగా కొంతమంది వ్యాపారుల అండదండలతో యథేచ్ఛగా విక్రయాలు సాగిస్తున్నారు. గుట్కా ప్యాకెట్లు తరలిస్తూ తరచూ పలువురు పట్టుబడుతున్నా..విక్రయాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో పార్వతీపురం నేడు గుట్కా వ్యాపారానికి అడ్డాగా మారింది

చడీచప్పుడు లేకుండా విక్రయాలు

పార్వతీపురం పట్టణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో కిరాణా షాపులు, ఫ్యాన్సీ షాపులు, బడ్డీ దుకాణాల్లో గుట్కా ప్యాకెట్లు, ఖైనీ ప్యాకెట్లు చడీచప్పుడు లేకుండా కూరగాయల బుట్టలు, బస్తాలు, చిన్న చిన్న సంచులలో భద్రపరుచుకుని విక్రయిస్తున్నారు. పోలీసులు తనిఖీ చేసే సమయంలో కూడా ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ముందుగానే పప్పుధాన్యాల బస్తాల్లో, కూరగాయల బుట్టల్లో భద్రపరుస్తున్నారు. గుట్కాలకు అలవాటుగా మారిన వారు అధిక ధరలు పెట్టి వాటిని కొంటూనే ఉన్నారు. దీంతో ప్రజల ఆరోగ్యాలతో అక్రమార్కులు చెలగాటమాడుతున్నారు.

అనారోగ్యం బారిన పడుతున్న జనం

పార్వతీపురం పట్టణం, మండలంతో పాటు జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో సైతం నిషేధిత పొగాకు ఉత్పత్తులను తిని పలువురు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఎక్కువగా యువకులు ఖైనీ, గుట్కాలను తిని ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా మానిక్‌చంద్‌, డీలక్స్‌, మిరాజ్‌, పాన్‌పరాగ్‌, రాజాఖైనీ, ఖైనీ వంటి బ్రాండ్లకు చెందిన గుట్కాలు జోరుగా విక్రయిస్తున్నారు. ఒడిశా నుంచి అక్రమంగా తరలించే బండిళ్లలో తీసుకువచ్చి ఒక్కో ప్యాకెట్‌ను రూ.15 నుంచి రూ.25వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

ప్రాణాంతకమైన వ్యాధులు

గుట్కా తింటే నోటి నుంచి జీర్ణవ్యవస్థ వరకు అన్నింటిపైనా ప్రభావం పడుతుంది. దానివల్ల ప్రాణాంతకమైన జబ్బులబారిన పడే ప్రమాదం ఉంది. కేన్సర్‌, గుండెజబ్బులు, నోటి కేన్సర్‌, గొంతు కేన్సర్‌ వంటి భయంకరమైన రోగాలు వస్తాయి. పళ్లు అరిగిపోయి గారపడతాయి. నాలుక రుచి మొగ్గలు నశిస్తాయి. వాటి వల్ల ప్రాణనష్టం కూడా జరిగే ఆస్కారం ఉంది.

– డా.యాళ్ల వివేక్‌, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు, పార్వతీపురం

గుట్టుచప్పుడుగా గుట్కా విక్రయాలు1
1/1

గుట్టుచప్పుడుగా గుట్కా విక్రయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement