కలలు చెదిరిపోయే..జనం బెదిరిపోయే..
● ఈ ఏడాదైనా బాగుంటే చాలు అంటున్న వివిధ వర్గాల ప్రజలు
సాక్షిప్రతినిధి విజయనగరం:
రామభద్రపురం మార్కెట్‌లో కూరగాయల బస్తాలు దించేసి తువ్వాలుతో ముఖం తుడుచుకుని ఆటోలో చేరబడ్డాడు సింహాచలం. పక్కనే సొత్తికూర కావిడితో నిలబడి బీడీ ఊదుతూ నిలబడిన నారాయణతో మాట కలిపాడు. ఏట్రా నారాయణా.. ఇంకొంచెం గడిస్తే కొత్త సంవత్సరం వచ్చేద్ది.. మరేటి లేదేట్రా అన్నాడు. ఎందుకు లేదురా బాబూ.. ఇంట్లో మీ అప్ప నెత్తల్ల ఇగురు.. గుడ్లు పులుసు చేసింది.. సాయంత్రం మా కల్లం కాడికి వచ్చేరా.. ఇద్దరం తలా బుక్కడు ఏసేద్దాం అన్నాడు. జాగర్తరా బాబు.. అసలే ఇది బాబు కాలం.. ఏది సరుకో.. ఏది ఇరుకో తెలీడం లేదు.. బాబు మార్క్ సరుకు తాగినా ఎండ్రిన్ తాగినా ఒకటే అని అంతన్నారు. నీ మందుకు ఒక దండం... నేను మిలట్రీ సరుకు తెచ్చుకున్నాను.. నువ్వే మా కోలగూడు సందుకాడికి వచ్చేయ్.. కూకుందాం అన్నాడు సింహాచలం.
సర్లేగానీ కొత్తసంవత్సరం బాగుంటాదంటావా అన్నాడు సింహాచలం. ఆ.. బాబు పాలనలో ఏ సంవత్సరమైనా ఒకటేన్రా... మనం ఏ ఊరికి వెళ్లినా ఆకాశం ఒకేలా కనిపించినట్లు చంద్రబాబు పాలన ఎప్పుడూ ఒకేలా ఉంటాదిరా.. ఆయన భ్రమల్లో ఉంటూ.. జనాన్ని భ్రమల్లో ఉంచగలను అనుకుంటాడు.. ఈ ఏడాది జనాలు మా సెడ్డ సికాకు పడిపోనారనుకో అన్నాడు నారాయణ. ఒసే.. ఏటయ్యిందిరా అన్నాడు సింహాచలం.. ఓర్నీ తింగరి సన్నాసి.. యూరియా కోసం నానా తిప్పలు పడ్డావు.. టీడీపీ వాళ్ల గుమ్మం ముందు, ఆర్‌ఎస్‌కేలు, ప్రైవేటు దుకాణాల వద్ద పడిగాపులు కాసినావ్.. అప్పుడే మర్చిపోనవేటిరా అన్నాడు నారాయణ.. ఒసే... యాదొచ్చిందిరో.. అన్నాడు సింహాచలం. అది కాకుండా.. పెన్షన్లు కోసం ఎన్ని తిప్పలు.. పడ్డాం. మా ఈరకత్తికి పెన్షన్ కోసం సదరం కోసం ఆస్పత్రులు తిప్పినారు అన్నాడు. 50 ఏళ్లు నిండిన బడుగువర్గాలవారందరికీ పింఛన్ ఇస్తామన్నారు.. ఒక్కరికై నా ఇచ్చార్రా.. ఉన్నది తీసేస్తున్నారు..అన్నాడు నారాయణ.. అవునుకదూ.. జనం గురించి అస్సలు పట్టించుకోవడంలేదు అన్నాడు సింహాచలం.
అదొక్కటేనా మా అమ్మికి ఆపరేషన్ కోసం ఆస్పత్రికి వెళ్తే ఆరోగ్యశ్రీ లేదు.. ఏం లేదు పొమ్మన్నారు.. బాబుగారు డబ్బంతా షికార్లకు తగలేసి ఆస్పత్రుల బిల్లులు ఎగ్గొట్టారట. మరేటి చేస్తాం. యాభైవేలెట్టి బయట ఆపరేషన్ చేయించాం. మా మనవడికి ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా రాలేదు.. ఆ కాలేజీవారు ఈ గుంటడిని గొప్ప ఇబ్బంది పెట్టేశారనుకో.. ఆఖరుకు షావుకారు కాడ మా అమ్మి గొలుసు పద్దుపెట్టి ఫీజు కడితే తప్ప పరీక్ష రాయించలేదు. మా ఊరో ళ్లకు చాలామందికి తల్లికి వందనం పథకం పడలేదురా... వారు రోజూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదట.. ప్రభుత్వం ఇవ్వకపోతే మాకేటి చేయమంటారని విసుక్కుంటున్నారట.. ఒకటా రెండా ఎన్నని చెప్తాను అన్నాడు నారాయణ.. అవునొరే.. ఇవన్నీ ఒకెత్తు కానీ ఈ మందు మాత్రం మరి చెప్పలేమురా అన్నాడు సింహాచలం.. జగనున్నప్పుడు ఎక్కడో ఒకటో రెండో దుకాణాలు ఉండేవి. ఇప్పుడు నీరు లేని ఊరుంది కానీ బీరు లేని వీధి లేదురా అయ్యా.. ఒక్కో ఊరికి మూడేసి బెల్ట్ షాపులు.. ఎవడు తాగేసి ఉన్నాడో. ఎవడు నార్మల్ ఉన్నాడో పట్టుకోలేకపోతున్నాం. చీకటి పడితే వీధిలోకి రావడానికి ఆడోళ్లు భయపడిపోతున్నారు.. అన్నాడు సింహాచలం.. నిజమే.. మొన్న మా వీధిలో ఆ మంగ అలా వెళ్తుంటే తాగుబోతు వెదవలు గోలగోల చేసినారు.. అది పెద్ద పంచాయితీ అయింది.. అన్నాడు నారాయణ.
రేషన్ కోసం ముసల్ది కూడా ఎక్కడికో వెళ్లాల్సిన దరిద్రంరా బాబూ.. పింఛన్‌కోసమూ అంతే కష్టాలు. ఒకటా రెండా. ఎన్నని చెబుతాంలే.. ఓటేసినందుకు దరిద్య్రాన్ని మోయాలి అన్నాడు నారాయణ... అవునోరే జగన్ కట్టిన గవర్న్‌మెంట్ ఆస్పత్రులు.. మెడికల్ కాలేజీలు ప్రైవేటుకు ఇచ్చేత్తన్నాడట చంద్రబాబు.. ఇలాంటి సెడుబిడకల పనుల్లో బాబు ముందుంటాడు. ఏదీ కట్టలేడు కానీ అమ్ముకోవడంలో మనోడు నంబర్ వన్.. కొత్త ఏడాదైనా మనకు బావుంటాదంటావా అన్నాడు నారాయణ.. అర్రే.. అన్నీ తెలిసి మళ్లీ అడుగుతావేంట్రా బాబు.. బాబుంటే దరిద్రం ఉన్నట్లే.. మనకు దరిద్రం ఉంటే బాబు ఎదురొచ్చినట్లే.. ఐదేళ్లూ మనకు ఇదే సినిమా చూపిస్తాడు అన్నాడు సింహాచలం. ఓరినాయనో.. భయంగా ఉంది.. సర్లే ఉండు సొత్తి కూడా ఇచ్చేసి వస్తాను అంటూ బయటకు వెళ్లాడు నారాయణ.
కలలు చెదిరిపోయే..జనం బెదిరిపోయే..


