జిందాల్ కార్మికుల ఆందోళన
కొత్తవలస: మండలంలోని అప్పన్నపాలెం గ్రామ సమీపంలోని జిందాల్ స్టెయిన్‌లెస్ స్టీల్ కర్మాగారాన్ని వెంటనే తెరవాలని కోరుతూ వైఎస్సార్ టీయూసీ, టీఎన్‌టీయూసీ, సీపీఎం కార్మిక సంఘాల నాయకులు కర్మాగారం గేటు ముందు శుక్రవారం ఆందోళన చేశారు. జిందాల్ యాజమాన్యం తీరుపై నిరసన తెలిపారు. కార్మికులను రోడ్డున పడేసి మిన్నకుండడం తగదన్నారు. లాకౌట్ కాలానికి పూర్థిస్థాయి వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కాకి సురేష్, కార్మిక సంఘం జేఏసీ నాయుకులు లగుడు వామాలు, భీమన్న, సీపీఎం నాయుకులు గాడి అప్పారావు, నమ్మి చిన్నబాబు, మద్దిల రమణ, తదితరలు పాల్గొన్నారు.
ప్రశాంతంగా ఏపీఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష
విజయనగరం అర్బన్: జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఏపీఆర్‌జేసీ, ఏపీఆర్‌ఈఐ, రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఏపీఆర్‌ఈఐ గురుకులాల్లో 5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశం కోసం జిల్లాలో నిర్వ హించిన 6 కేంద్రాల్లో 1,288 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 1,064 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం పూట 10 పరీక్ష కేంద్రాల్లో జరిగిన ఏపీఆర్‌జేసీ, ఏపీఆర్‌డీసీ ప్రవేశ పరీక్షను 1,891 మంది రాశారు. ఏపీఆర్‌డీసీ కోసం దరఖాస్తు చేసుకున్న 77 మంది అభ్యర్థుల్లో 65 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారని డీఈఓ యు.మాణిక్యంనాయుడు తెలిపారు. పట్టణంలోని పలు పరీక్ష కేంద్రా లను ఆయన అకస్మికంగా తనిఖీచేశారు. ఆయన వెంట పరీక్షల సహాయ కమిషనర్ టి.సన్యాసిరాజు ఉన్నారు.
‘ఉపాధి’ వేతనం పెరగాలి
● కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
రాజాం సిటీ: ఉపాధిహామీ వేతనదారులకు అత్యధిక వేతనం వచ్చేలా పని కల్పించాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సూచించారు. రాజాం నియోజకవర్గ స్థాయిలో ఉపాధిహామీ పనులపై స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పనుల తీరు, వేతనదారులకు అందుతున్న వేతనంపై ఆరా తీశారు. ఎండల దృష్ట్యా రెండు పూటలా పనులు చేయించాలని సూచించారు. పని ప్రదేశంలో తాగునీరు, టెంట్లు ఏర్పాటు చేయాలని సూ చించారు. వేతనదారుకు రూ.307లు అందేలా పని కల్పించాలన్నారు. సమావేశంలో డ్వామా పీడీ ఎస్.శారదాదేవి, ఆర్డీఓ సత్యవాణి, ఎంపీడీఓలు, ఏపీఓలు, టెక్నికల్ అసిస్టెంట్‌లు పాల్గొన్నారు.
జిందాల్ కార్మికుల ఆందోళన
జిందాల్ కార్మికుల ఆందోళన


