అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వీడండి
● కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్
● పీజీఆర్‌ఎస్‌కు 147 వినతులు
పార్వతీపురం టౌన్: పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన వినతులు సొంత సమస్యలుగా భావించి పరిష్కార దిశగా అడుగులు వేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ ఆవరణలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో 147 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. అర్జీల పరిష్కారాన్ని వేగవంతం చేసే ప్రక్రియలో ఎటువంటి తప్పిదాలకు తావివ్వద్దన్నారు. పరిష్కారమయ్యే సమస్యలతో అర్జీదారులు సంతృప్తి చెందాలని పునఃప్రారంభం కారాదని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్‌ఎస్ శోభిక, డీఆర్‌ఓ హేమలత, ఎస్‌డీసీ పి.ధర్మచంద్రారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ ఎం.సుధారాణి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అర్జీలలో కొన్ని ఇలా..
● 25 కుటుంబాల నివాసం ఉండే గుమ్మలక్ష్మీపురం మండలం కొండబిన్నిడి గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేక అత్యవసర పరిస్థితిలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, ఆ గ్రామానికి చెందిన గిరిజనులు వినతిని అందజేశారు.
● కురుపాం మండలం పెద్దగొత్తిలిలో సచివాలయం, రైతు భరోసా కేంద్ర నిర్మాణం పనులు అసంపూర్తిగా ఉన్నాయని, ప్రస్తుతం పాత పంచాయతీ భవనం పాడవ్వడంతో వర్షం నీరు కారుతుందని, పరిపాలనకు ఆటంకం కలుగుతుందని, నిర్మాణ పనులు చేపట్టాలని గ్రామ సర్పంచ్ పి.టి.లోకనాధం వినతిని అందజేశారు.


