
హెచ్‌సీ కృష్ణమూర్తికి సత్కారం
పార్వతీపురం రూరల్: పార్వతీపురం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కె.కృష్ణమూర్తి తనకు నెలకు వచ్చిన జీతంలో కొంతమొత్తాన్ని పేదప్రజలు, పేద విద్యార్థుల అవసరాలు తీర్చేందుకు ఉపయోగిస్తున్న విషయం, అలాగే మరికొన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ మేరకు ఆదివారం పట్టణ శివారులో ఉన్న సూర్యపీఠం దేవస్థానంలో సాహితీ లహరి, మంచుపల్లి సేవాసంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో హెడ్‌కానిస్టేబుల్ కృష్ణమూర్తి సేవలను కొనియాడుతూ కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్, ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డీవీజీ శంకరరావుల చేతుల మీదుగా సాహితీ లహరి సేవాశ్రీ పురస్కారాన్ని కృష్ణమూర్తికి అందజేశారు. కార్యక్రమంలో డా.మంచుపల్లి శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ పోలీస్‌శాఖలో పనిచేస్తూ తన కష్టార్జితంలో కొంతమొత్తాన్ని సామాజిక రంగంలో విస్తృతంగా సేవలు అందించేందుకు కేటాయిస్తున్న కృష్ణమూర్తి సేవలు పలువురికి ఆదర్శమని ప్రశంసించారు.
పశువులశాల దగ్ధం
దత్తిరాజేరు: మండలంలోని పిలింగాలవలసలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించడంతో పశువుల శాల, గడ్డివాములు దగ్ధమైనట్లు గ్రామస్తులు తెలిపారు. గండి సింహాచలానికి చెందిన పశువుల శాలకు నిప్పు అంటుకోవడంతో పక్కనే ఉన్న గండి కృష్ణ గడ్డివాములు దగ్ధమయ్యాయి. గ్రామస్తులు సమాచారం అందించడంతో బాడంగి ఫైర్ స్టేషన్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు.
బిల్లుమడ సమీపంలో ఏనుగులు
భామిని: మండలంలోని పాత బిల్లుమడ సమీపంలో ఆదివారం ఏనుగుల గుంపు హడావిడి చేసింది. గ్రామ సమీపంలోకి నాలుగు ఏనుగుల గుంపు ప్రవేశించడంతో చూసేందుకు పిల్లలు,పెద్దలు పోటీ పడ్డారు.వరుస సెలవులు కావడంతో పిల్లలతో పెద్దలు బిల్లుమడ గ్రామానికి వెళ్లి ఏనుగులను దగ్గరుండి చూశారు. సందర్శకులు పెరిగి కేకలు వేయడంతో తోటలోకి ఏనుగులు జారుకున్నాయి. ఏనుగుల సమీపంలో ఉండాల్సిన ట్రాకర్స్ వలస రైతు జీడి తోటకాపలాలోనే ఉంటున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు.
పౌష్టికాహారంపై అవగాహన
వంగర: ఇంటి పనుల్లో మహిళలకు పురుషులు సహకారం అందించాలని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ కె.కల్యాణి కోరారు. పౌష్టికాహార పక్షోత్సవాల్లో భాగంగా మండలంలోని కోనంగిపాడు గ్రామ అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణులు, బాలింతలకు ఇంటి వద్ద పురుషులు అందించాల్సిన సహకారంపై ఆదివారం అవగాహన కల్పించారు. వారికి ప్రతిరోజూ పౌష్టికాహారం అందేలా చూడడంతో పాటు బరువులు ఎత్తే పనులు వారితో చేయించవద్దన్నారు. రెండేళ్ల వయసు వరకు చిన్నారులను బాగా చూసుకోవాలన్నారు. అనంతరం పౌష్టికాహారం ప్రయోజనాలను గర్భిణులు, బాలింతలకు వివరించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు సీహెచ్ రూపావతి, జి.రమణి, జి.పద్మ, ఎన్.లక్ష్మి, పి.కల్యాణి తదితరులు పాల్గొన్నారు.
యువకుడి మృతిపై కేసు నమోదు
కొత్తవలస: మండలంలోని విజయనగరం రోడ్డులో గల బలిఘట్టం గ్రామం జంక్షన్ సమీపంలో శనివారం లారీ ఢీకొని గొల్లలపాలెం గ్రామానికి చెందిన ఎస్.వినయ్‌కుమార్ మృతి చెందడంపై సీఐ ఎస్.షణ్ముఖరావు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన లారీని సీజ్ చేసినట్లు ఆదివారం ఆయన తెలిపారు.లారీ డ్రైవర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని గాలింపు చేపట్టినట్లు చెప్పారు. కాగా మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించినట్లు తెలిపారు.

హెచ్‌సీ కృష్ణమూర్తికి సత్కారం

హెచ్‌సీ కృష్ణమూర్తికి సత్కారం