
ప్రజలపై గ్యాస్ మంట
విజయనగరం గంటస్తంభం: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, ఇంటి పన్ను, కరెంట్ బిల్లుతో పాటు వంట గ్యాస్‌పై 50 రూపాయలు పెంచడాన్ని నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం స్ధానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం జంక్షన్ ఉన్న ఎన్టీఆర్ విగ్రహం దగ్గర గ్యాస్ బండలు మహిళలు నెత్తిన పెట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ మాట్లాడుతూ..కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాల దెబ్బకు ప్రజల జీవన విధానం కుదేలైందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఉచిత గ్యాస్ అనే పేరుతో ఆర్భాట ప్రచారాలు నిర్వహించి ఎన్నికల్లో నెగ్గిన తర్వాత శ్రీరామనవమి సందర్భంగా వంట గ్యాస్‌పై 50 రూపాయలు పెంచి ప్రజలపై అధిక భారం మోపుతున్నారన్నారు. అధికారం చేపట్టిన పది నెలల కాలంలో విద్యుత్ చార్జీలు, మందుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు, ఆస్తి పన్ను పెంపు, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. గత ప్రభుత్వంలో ఆనాడు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు బాదుడే బాదుడు అంటూ ఆందోళనకు దిగారని విమర్శించారు. పట్టణాల్లో పెంచిన ఆస్తి పన్నులతో ప్రజలు సతమతం అవుతున్నారని, ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతున్నా ఇక్కడ మాత్రం అధిక ధరలు పెంచడం సిగ్గుచేటు అని విమర్శించారు. వెంటనే ఎకై ్సజ్ సుంకం రద్దు చేయాలని కోరారు. పెట్రోల్,డీజల్, గ్యాస్ ధరలను తగ్గించకపోతే ప్రజల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్.రంగరాజు, మార్క్‌నగర్ ఽశాఖ సహాయ కార్యదర్శి బూర వాసు, బల్లివీధి శాఖ సహాయ కార్యదర్శి పొందూరు అప్పలరాజు, శాంతినగర్ శాఖ నాయకురాలు సూరీడమ్మ, మహిళలు పాల్గొన్నారు.
మహిళల నిరసన