
నగరంలో కేంద్ర బృందం పర్యటన
విజయనగరం: ప్రభుత్వం తరఫున ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీసేందుకు కేంద్ర బృందం నగరంలో శనివారం పర్యటించింది. నేషనల్ క్వాలిటీ ఎస్యూరెన్స్ స్టాండర్ట్స్ కమిటీ సభ్యులైన డాక్టర్ గౌరవ్ త్రిపాఠి, సుదీప్ శుక్లాదాస్ రెండు రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు శనివారం విచ్చేశారు. జిల్లా కేంద్రంలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. నగరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా అందుతున్న వైద్య సేవలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. పీహెచ్‌సీలను తనిఖీ చేయడంతో పాటు హెల్త్ సెక్రటరీలు, ఏఎన్‌ఎంలు, ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వీటీ అగ్రహారంలో ఉన్న జొన్నగుడ్డి పీహెచ్‌సీకి చేరుకుని అక్కడ ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు, మందుల పరిస్థితి, వైద్య పరికరాల పనితీరు వంటి అంశాలను నిశితంగా పరిశీలించారు. అనంతరం 41వ నంబరు సచివాలయం చేరుకుని అక్కడ వివిధ అంశాలను, వైద్య పరమైన సేవలను ఏఎన్‌ఎంలను అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఈ బృందం సభ్యులు తమ పరిశీలన అంశాలను నమోదు చేసి పీహెచ్‌సీలకు ర్యాంకింగ్‌లు ఇవ్వనున్నారు. మరో వారం రోజుల్లో వేరొక బృందం రానున్నట్టు వైద్య సిబ్బంది తెలిపారు.