గజపతినగరం: గజపతినగరం జాతీయ రహదారి పక్కన, మెంటాడ జంక్షన్ రోడ్డు ఇరువైపులా ఉన్న మొత్తం 8షాపుల్లో ఇటీవల చోరీకి పాల్పడిన దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం గజపతినగరం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గజపతినగరంలో దొంగతనాలకు పాల్పడిన వారు అంతర్ రాష్ట్ర గజదొంగలన్నారు. కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో వరుసగా వీరు దొంగతనాలకు పాల్పడుతూ వస్తున్నారని రాత్రి పూట ఎవరు లేని సమయంలో షట్టర్లు పగులగొట్టి నగదు, సొత్తు లూటీ చేయడమే వారి పని అని తెలిపారు. సీసీ టీవీ ఫుటేజీ ద్వారా నిందితులను గుర్తించి నలుగురిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశామని చెప్పారు. అరెస్ట్ అయిన వారిని షేక్ బాషా, రావుల రమణ, శ్రీనునాయక్, గుల్లిపల్లి కిరణ్‌కుమార్‌లుగా గుర్తించినట్లు తెలిపారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు వెంకటేశ్ శివగౌడ, రంగురవిల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. నిందితుల నుంచి రూ.88వేల620నగదు, 9స్టార్ట్‌ఫోన్‌లు,ఒక ల్యాప్‌టాప్, మూడు గోల్డ్ కలర్ వాచ్‌లను రికవరి చేసినట్లు డీఎస్పీ వివరించారు. కార్యక్రమంలో సీఐ, ఎస్సైలతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
రూ.88వేల620, 9స్మార్ట్‌ఫోన్‌లు,
ఒక ల్యాప్‌టాప్,
మూడు గోల్డ్ కలర్ వాచ్‌లు స్వాధీనం


