ఉయ్యాలో.. ఉయ్యాలా..
విజయనగరం
బుధవారం శ్రీ 30 శ్రీ అక్టోబర్ శ్రీ 2024
విజయనగరం టౌన్: భక్త కోటికి సిరులిచ్చే చిన్నారి పైడిమాంబ ఊయల ఊగుతూ భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. మంగళవారం రాత్రి కన్నులపండువగా సాగిన ఉయ్యాలకంబాల ఉత్సవాన్ని తిలకించిన భక్తులు తన్మయత్వం చెందారు. చదురుగుడి ఆవరణలో ప్రత్యేకంగా అలంకరించిన ఉయ్యాల చుట్టూ అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని మూడుసార్లు ప్రదక్షిణ జరిపారు. అనంతరం సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు సమక్షంలో ఉయ్యాలలో ఆశీనులను చేసి శాస్త్రోక్తంగా ఉయ్యాకంబాల ఉత్సవ ఘట్టాన్ని పూర్తిచేశారు.
● అమ్మవారికి ప్రత్యేక పూజలు
పైడితల్లి జాతరలో చివరి ఘట్టమైన ఉయ్యాల కంబాల మహోత్సవాన్ని పురస్కరించుకుని వేకువజాము నుంచి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, విశేష కుంకుమార్చనలు జరిపారు. ఆలయ ఈఓ డీవీవీ ప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు ఏడిద రమణ, బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, నేతేటి ప్రశాంత్‌ల నేత్రత్వంలో ప్రత్యేక పూజలు సాగాయి. ధనత్రయోదశిని పురస్కరించుకుని మహాలక్ష్మి అష్టోత్తరనామాలతో కుంకుమార్చనలు చేశారు. అమ్మవారి ఘటాలకు విశేష పూజలు జరిపారు. ఉయ్యాల కంబాల ఉత్సవం అనంతరం సిరిమానుతో పాటు తెచ్చిన రాటకు మూడుసార్లు గొడ్డలి ఆనించి ఉయ్యాలను తీసివేశారు. దీంతో అమ్మవారి జాతరకు ముగింపు పలికినట్లేనని, బుధవారం వనంగుడి వద్ద చండీహోమం పూర్ణాహుతితో జాతర ముగుస్తుందని అర్చకులు తెలిపారు. ఉత్సవం పూర్తయిన తర్వాత అమ్మవారిని మేళతాళాలతో వనంగుడికి తీసుకువెళ్తారు. బుధవారం నుంచి అమ్మవారు వనంగుడిలో ఆరు నెలల పాటు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
● వనంగుడిలో విశేష పూజలు
రైల్వేస్టేషన్ వద్ద ఉన్న పైడితల్లి అమ్మవారి వనంగుడిలో వేకువజామునుంచి పంచామృతాలతో అభిషే కాలు, అర్చనలు జరిగాయి. వేదపండితులు వెలువలపల్లి నరసింహమూర్తి, సాయికిరణ్‌లు శాస్త్రోక్తంగా పూజాధికాలు చేశారు. అనంతరం అర్చ కులు నేతేటి ప్రశాంత్ ఆధ్వర్యంలో అమ్మవారికి, బాలాయలంలో చిన్నారి పైడితల్లికి, ఆలయ ఆవరణలో పుష్పాలతో ప్రత్యేక అలంకరణలు జరిగాయి.
● నేడు దీక్షధారుల యాత్ర
అమ్మవారి దీక్షధారులు మంగళవారం రాత్రి, బుధవారం వేకువజామున ఇరుమడులు కట్టుకుని ఉదయం 6 గంటలకు చదురుగుడికి అమ్మవారి నామస్మరణ చేస్తూ అమ్మవారి ఉత్సవవిగ్రహంతో వనంగుడికి బయలుదేరుతారు. వనంగుడి వద్ద నిర్వహించే చండీహోమం, పూర్ణాహుతి కార్యక్రమాల్లో పాల్గొంటారు. పూర్ణాహుతి పూర్తయిన తర్వాత దీక్ష విరమణలు చేస్తారు. దీంతో నెలరోజుల పాటు సాగిన జాతర ముగుస్తుంది.
అమ్మ దర్శనం కోసం కోట వరకూ బారులు తీరిన భక్తులు
నేత్రపర్వంగా పైడితల్లి ఉయ్యాల కంబాల మహోత్సవం
అమ్మదర్శనానికి పోటెత్తిన భక్తులు
నారింజ పండ్లతో అమ్మవారికి నివేదన
బుధవారం నుంచి వనంగుడిలో కొలువుదీరనున్న పైడితల్లి
సిరిమానోత్సవం రోజు అమ్మవారిని దర్శించుకోలేని భక్తులు ఉయ్యాల కంబాల ఉత్సవం రోజున అమ్మవారి సేవలో తరంచారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు 50వేల మంది అమ్మవారిని దర్శించుకున్నట్టు ఆలయ అఽధికారులు తెలిపారు. అమ్మవారి దర్శనానికి ఉదయం నుంచే భక్తులు బారులు తీరాయి. తొలేళ్లు, సిరిమానోత్సవం రోజులు తలపించాయి. మధ్యా హ్నం 2 గంటల వరకు క్యూలు రద్దీగా కనిపించాయి. పైడితల్లికి ఘటాలు సమర్పించారు. మొక్కుబడులు చెల్లించారు. వివిధ వేషధారణలతో కళాకారులు ఆకట్టుకున్నారు. ఆలయ ఆవరణలో విశాఖపట్టణానికి చెందిన సర్వేజనా సుఖినోభవంతు బి.ఎస్.సత్యమాధవి, వరలక్ష్మి, సునీతల ఆధ్యాత్మిక గ్రూపుకు చెందిన మహిళలు అమ్మవారిని కీర్తిస్తూ ఆలపించిన భక్తిగీతాలు ఆద్యంతం భక్తులను అలరించాయి. పలు స్వచ్ఛంద సంస్థలు, దేవదాయశాఖ సిబ్బంది భక్తులకు మంచినీరు, పులిహోర, మజ్జిగ, ప్రసాదం ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో రామ తీర్థం ఈఓ వై.శ్రీనివాసరావు, ఆలయ సూపర్‌వైజర్ ఏడుకొండలు, సీనియర్ అసిస్టెంట్ మణికంఠ, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఉయ్యాలో.. ఉయ్యాలా..
ఉయ్యాలో.. ఉయ్యాలా..
ఉయ్యాలో.. ఉయ్యాలా..


