ఉత్తరాంధ్ర అభివృద్ధిపై టీడీపీకి చిత్తశుద్ధి లేదు : మజ్జి శ్రీనివాసరావు | - | Sakshi
Sakshi News home page

ఉత్తరాంధ్ర అభివృద్ధిపై టీడీపీకి చిత్తశుద్ధి లేదు : మజ్జి శ్రీనివాసరావు

Dec 22 2023 1:00 AM | Updated on Dec 22 2023 1:08 PM

- - Sakshi

విజయనగరం: తెలుగుదేశం పార్టీ తన ఐదేళ్ల పాలనలో ఉత్తరాంధ్ర ప్రజలను దగా చేసిందే తప్ప, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి చూపలేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగున్నరేళ్లుగా ప్రజారంజక పాలన చేస్తున్న ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ టీడీపీ నేత నారాలోకేశ్‌ యువగళమంతా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై అక్కసుతోపాటు వ్యక్తిగత దూషణలు చేయడానికే పరిమితమైందన్నారు. నాలుగున్నరేళ్లుగా అవినీతిరహితంగా పాలన సాగిస్తున్న వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంపై ఒక్క ఆరోపణ చేయలేకపోయారన్నారు. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులపై మాట్లాడలేదంటే వైఎస్సార్‌ సీపీ జనరంజక పాలన టీడీపీకి అర్థమై ఉంటుందన్నారు.

యువగళంలో టీడీపీ నేతలు ఉచిత పథకాలకు అలవాటుపడొద్దని ప్రజలకు కళ్లబొల్లి కథలు చెప్పి ఆరు ఉచిత పథకాలను ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. భోగాపురం విమానాశ్రయ నిరాశ్రయులకు పరిహారం మాటెత్తకుండా, టెండర్లు ఖరారు చేయకుండా ఎన్నికల ముందు చంద్రబాబు ఉత్తుత్తి శంకుస్థాపన చేసేశారన్నారు. అన్ని సమస్యలు పరిష్కరించాకే వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం పనులు ప్రారంభించిందన్నారు. ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టడం, ఎన్నికలయ్యాక ప్రజలకు శఠగోపం పెట్టడం చంద్రబాబుకు అలవాటేనన్నారు.

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెనాయుడు బీసీలకు తామేదో ప్రాధాన్యం కల్పిస్తున్నామని గొప్పలు చెప్పుకున్నారని, టీడీపీ పాలనలో బీసీ మహిళకు ఇచ్చిన మంత్రి పదవిని తీసేసి, క్షత్రియ వర్గానికి కేటాయించిన విషయం జిల్లా ప్రజలకు తెలుసన్నారు. ప్రజా సంక్షేమం, అన్ని ప్రాంతాల అభివృద్ధే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ధ్యేయమన్నారు. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే తలంపుతో ముఖ్యమంత్రి ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తుంటే... టీడీపీ, ఎల్లో గ్యాంగ్‌ దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుపు తథ్యమని, ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమన్నారు. ఆయనవెంట పలాస నియోజవర్గ వైఎస్సార్‌ సీపీ పరిశీలకుడు కేవీ సూర్యనారాయణరాజు, వేపాడ జెడ్పీటీసీ సభ్యులు సేనాపతి అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.
ఇవి చ‌ద‌వండి: 'జగనన్నకు కొండపిని కానుకగా ఇస్తా!' : ఆదిమూలపు సురేష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement